సూర్యాపేట, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ‘కేంద్రంలోని బీజేపీ ఎనిమిదిన్నరేండ్ల పాలనలో ధరలు పెంచుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ గద్దలకు అప్పగిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల నోట్లో మట్టి కొట్టింది. ఇదే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టడంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి ఎరవేసే డబ్బులకు ఆశపడి మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనకు ఓటు వేస్తే అధోగతి పాలవుతారు తస్మాత్ జాగ్రత్త.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హెచ్చరించారు. అన్నీ చేస్తున్న టీఆర్ఎస్ను ఆదరించి మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని బుధవారం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదేండ్ల కోసం రాజగోపాల్‌రెడ్డిని ఎన్నుకుంటే నాలుగేండ్లకే రాజీనామా చేసి, మళ్లీ గెలిపించాలని కోరుతున్న ఆయన ఏడాదిలో ఏం చేస్తాడో చెప్పడం లేదని అన్నారు. నాలుగేండ్లలో ఆయన నియోజకవర్గ సమస్యలు ఒక్కటీ అడుగలేదని.. ఎక్కడైనా ఆసుపత్రి అడిగిండా.. సాగు నీరు అడిగిండా.. కళాశాల అడిగిండా? మరి దేనికి రాజీనామా చేసిండని ప్రశ్నించారు. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఉప ఎన్నిక వస్తుందని, ఇక్కడ మాత్రం 18వేల కోట్లకు అమ్ముడుపోతే ఈ ఎన్నిక వచ్చిందని, కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిండని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవ చేసిండా..? నాలుగేండ్లుగా పంతంగి ముఖం చూడని రాజగోపాల్‌రెడ్డికి ఓటేందుకు వేయాలని ప్రశ్నించారు. ఒక్క కొబ్బరికాయ కొడితే వంద పనులు అవుతాయన్న ఆయనకు నాలుగేండ్లుగా ఒక్కటీ దొరకలేదా? అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నామని, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు బాగు చేసుకున్నామని తెలిపారు.
అహంకారం.. ఆత్మగౌరవం ఏది గెలువాలి?
ప్రజలకు సేవ చేయకున్నా డబ్బులు పంచితే గెలుస్తానని రాజగోపాల్‌రెడ్డి అనుకుంటున్నాడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన అహంకారం గెలువాలో.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలువాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. సైదాపురం, లింగోటం రోడ్డు, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్స్ కావాలని ప్రజలు తన దృష్టికి తెచ్చారని, ఒక్క అవకాశం ఇస్తే తాను బాధ్యత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీఇచ్చారు. ఇంటి జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు డబ్బులిచ్చే పథకం తెస్తున్నామని చెప్పారు. డబ్బు, మద్యాన్ని నమ్ముకొని ప్రచారం చేస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సంక్షేమంలో దేశంలోనే టాప్
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉన్నదన్నారు. రైతులకు ఏడాదికి రూ.14,500 కోట్లు ఖర్చు పెట్టి ఎకరానికి 10వేల రపాయల రైతుబంధు, చనిపోతే రైతుబీమా ద్వారా 5లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్దేనన్నారు. సామాజిక పింఛన్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.700, కర్ణాటకలో రూ.600 ఇస్తుండగా.. తెలంగాణలో రూ.2016 ఇస్తున్నట్లు తెలిపారు. చెప్పాలంటే వంద పనులున్నాయి.. మరి రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ ప్రశ్నించారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మూతూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ దేశాన్ని దివాళా తీయిస్తున్నదని విమర్శించారు.
దండు మల్కాపూర్‌లో యువతకు భారీ ఉపాధి
యువతకు ఉపాధి కల్పించేందుకు దండు మల్కాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసుకున్నామన్నారు. త్వరలోనే అక్కడ కాలుష్యరహిత పరిశ్రమలు ప్రారంభమవుతాయని చెప్పారు. 1865 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు పూర్తయితే దాదాపు 1.30లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అందులో అత్యధిక శాతం స్థానికులకే ఇస్తామని అన్నారు. ఎనిమిదేండ్లుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్కు కమ్యూనిస్టు పార్టీలు సైతం మద్దతిచ్చాయని తెలిపారు. బీజేపీ నాయకులు ఝూటా మాటలు చెప్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన సైదిరెడ్డికి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లు సీఎం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. ఆ బహుమానం కావాలంటే ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కారు గుర్తుపై ఓటేసి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతుకుముందు మీటింగ్ ప్రారంభమైన వెంటనే విద్యుత్ ఆగిపోయింది. బీజేపీ సర్పంచ్ కరెంటు కట్ చేయించాడని ఎంపీటీసీ బోయ ఇందిర, స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపించారు. వెంటనే ప్రచార వాహనాల్లో ఉన్న జనరేటర్‌ను ఆన్ చేసిప్రసంగం ప్రారంభించారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, సీపీఎం నేత చెరుపల్లి సీతారాములు
రాజగోపాల్‌కు ఓటేస్తే మోటర్లకు మీటర్లు..
కాంగ్రెస్ హయాంలో కరంట్ ఉంటే వార్త.. నేడు లేకుంటే వార్త అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్వరాష్ట్రంలో రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తూ.. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా చూస్తున్నామని చెప్పారు. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డికి ఓటేసి గెలిపిస్తే మోటర్లకు మీటర్లు, రైతుల ఇంటికి కరంటు బిల్లులు వస్తాయని హెచ్చరించారు. బాయికాడ మీటర్ పెడితే తప్పేంది అన్న రాజగోపాల్‌రెడ్డికి వచ్చే నెల 3న మీరంతా మీటర్ పెట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా 24గంటల కరంట్ ఇవ్వడంలేదని, తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. మోటర్లకు మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఖరాఖండిగా చెప్పారని గుర్తు చేశారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధరను రూ.400నుంచి 1200కు పెంచి అక్కాచెల్లెళ్ల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతుల ఆదాయం పెరుగకపోగా ఖర్చులు పెరిగాయన్నారు.
రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలి
చౌటుప్పల్ రూరల్ (పంతంగి), అక్టోబర్ 26 : రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు ఆశపడి మునుగోడు ప్రజలను నిండా ముంచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలి. ఆయన నాలుగేండ్లు నియోజకవర్గ అభివృద్ధిని మరిచిపోయి కాంట్రాక్టులకు అమ్ముడుపోయి మునుగోడు ప్రజలకు ద్రోహం చేశాడు. పదవికి రాజీనామా చేసి మతోన్మాద బీజేపీ పంచన చేరి మాయమాటలు చెప్తూ మళ్లీ వంచించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్రమంగా సంపాదించిన డబ్బును వెదజల్లి మళ్లీ గెలువాలని ఉప ఎన్నికకు తెరలేపాడు. అవకాశవాద రాజకీయం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలి. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.