నల్లగొండ ప్రతినిధి, జనవరి3(నమస్తే తెలంగాణ) : త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికారులు మున్సిపాలిటీల వారీగా ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా నకిరేకల్‌ను మినహాయిస్తే మిగతా 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉన్న వార్డుల వారీగా జాబితాలను విడుదల చేశారు.
అయితే ఈ జాబితాను పరిశీలిస్తే ఓటర్లతో పాటు ఆశావహుల గుండెలు గుభేల్మంటున్నాయి. వార్డుల వారీగా గత ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లు ఈ సారి మరో వార్డుకు మారిపోయారు. కాలనీలకు కాలనీలే ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకు మారిపోయాయి. వాస్తవంగా భౌగోళికంగా ఎలాంటి మార్పులు లేకుండా సంబంధం లేని వార్డుల్లోకి ఓటర్లు మారిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అన్ని వార్డుల్లో ఇంచుమించు సమానంగా ఓటర్ల సంఖ్య ఉండాల్సి ఉండగా ఒక వార్డులో 4 వేల పైచిలుకు ఓటర్లు ఉంటే మరో వార్డులో రెండు వేలు, ఇంకొన్ని వార్డుల్లో 14వందల మంది ఓటర్లే ఉన్నారు. దీంతో గతంలో ఆయా వార్డుల్లో నమోదై ఉన్న ఓటర్లను ముసాయిదా జాబితాలో ఏ వార్డులో కలిపారో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
చిత్రవిచిత్రాలేన్నో..
నల్లగొండ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పట్టణం నడిబొడ్డున ఉన్న వార్డుల్లో సైతం ఓటర్ల పేర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యాయి. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డులోకి చేర్చారు. భౌగోళికంగా ఒక వార్డు మధ్యలో ఉన్న కాలనీ ఓటర్లను ఆ వార్డు సరిహద్దును దాటి మరో వార్డులోకి మార్చారు. పద్మావతీ కాలనీ, ఆర్టీసీ కాలనీ, గొల్లగూడ, శ్రీనగర్‌కాలనీ తదితర కాలనీల్లోని ఓటర్లను వేరే వార్డుల్లో కలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్నవార్డుతో సంబంధం లేకుండా మరో వార్డులోకి కాలనీనే మార్చివేశారు. 41వ వార్డులో 3 వేల మంది ఓటర్లు ఉండగా ఇక్కడి కాలనీలనే వేరే వార్డులోకి కలపడంతో 1400 మంది ఓటర్లే మిగిలారు. ఇలాగే 42వ వార్డులోని ఆర్టీసీ కాలనీ ఓటర్లను మరో వార్డుకు మార్చారు. దీంతో ఇక్కడ ఓటర్ల సంఖ్య 1500కు పడిపోయింది. 41వ వార్డుకు చెందిన కొని అపార్టుమెంట్ల ఓటర్లను 47వ వార్డులోకి మార్చారు.
దీంతో 47వ వార్డులో ఓటర్ల సంఖ్య 3వేలకు దాటగా.. అక్కడ తగ్గిపోయాయి. 20వ వార్డులో ఉండాల్సిన 240 ఓట్లు 21వ వార్డులోకి మారాయి. 42వ వార్డు నుంచి 450 ఓట్లు 20వ వార్డులోకి మారిపోయాయి. ఇలా అడ్డదిడ్డంగా మార్చేయడంతో 22వ వార్డులో ఏకంగా ఓటర్ల సంఖ్య 4500కు పెరిగిపోయింది. ఈ వార్డే ప్రస్తుతం నల్లగొండలో అత్యధిక ఓటర్లు కలిగిన వార్డు. 20వ వార్డును పరిశీలిస్తే కలెక్టరేట్‌కు సమర్పించిన జాబితాలో 3030 మంది ఓటర్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. కానీ వార్డులో ఓటర్ల పేర్లతో ప్రకటించిన జాబితాలో 2400 మందే ఉన్నారు. ఇలా ఏ వార్డు జాబితాను పరిశీలించినా ఎన్నో చిత్ర విచిత్రాలు నెలకొన్నాయి. ఇలాగా పలు మున్సిపాలిటీల్లోని ముసాయిదా ఓటరు జాబితాలు తీవ్ర గందరగోళంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అభ్యంతరాల వెల్లువ..
ఈ ఆయా పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులతో పాటు ముఖ్యంగా తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అంతా ఓటర్ల జాబితాపైనే దృష్టి సారించారు. ఆయా వార్డులో తొలగించిన ఓటర్ల వివరాలు సేకరించి తిరిగి గతంలో ఉన్న వార్డుల్లోకి మార్చేలా అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. అదే సమయంలో తమ వార్డులోని పలు కాలనీలు ఇతర వార్డుల్లో కలపడంపైనా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వాటిని సరిచేయాలని సూచిస్తున్నారు.
అయితే ఈ సారి పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచనున్నట్లు తెలిసింది. వెయ్యి ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నా కొన్ని కేంద్రాల్లో 800 మంది ఓటర్లే ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం వార్డుల్లోని ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారీగా విభజించడంతో ఏకంగా ఒక వార్డు ఓటర్లు ఇంకో వార్డులోకి మారిపోయినట్లు సమాచారం. ముసాయిదా జాబితాను రూపొందించిన అధికారులు కొత్తవారు కావడంతో ఆయా వార్డులపై అవగాహన లేకపోవడంతో ఓటర్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారినట్లు చెప్తున్నారు. దీంతో తక్షణమే వార్డుల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఓటర్లను ఆయా వార్డుల్లోనే కొనసాగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
వార్డుల వారీగా సరిహద్దులను నిర్ణయిస్తూ ఆ హద్దుల లోపల నివాసం ఉండే ఓటర్లందర్నీ అదే వార్డు పరిధిలోకి వచ్చేలా జాబితాలను సరిచేయాలని పార్టీల నేతలు సూచిస్తున్నారు. వాస్తవంగా గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన మున్సిపల్ చట్టం ప్రకారం వరుసగా రెండోసారి కూడా అదే రిజర్వేషన్లు, వార్డులతో ఎన్నికలు జరపాల్సి ఉంది. శనివారం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి మున్సిపల్ చట్టానికి ఎలాంటి సవరణలు చేయలేదు. దీంతో పాత చట్టం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. అంటే కిందటి సారి ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న వార్డుల సంఖ్యలో మార్పులు లేకుండా వార్డుల పునర్విభజన కూడా లేకుండా గత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగనున్నట్లు అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
అభ్యంతరాలకు రేపే ఆఖరు రోజు..
ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించేందుకు సోమవారం చివరి రోజు. దీంతో వార్డుల వారీగా ప్రకటించిన వివరాల్లో అభ్యంతరాలు ఉంటే నేడు మాత్రమే అవకాశం ఉంది. వాస్తవంగా ఓటర్ల జాబితాలను మున్సిపాలిటీల్లో మాత్రమే అందుబాటులో ఉంచారు. పార్టీల వారీగా తమకు కూడా అందజేస్తే సమగ్రంగా పరిశీలించే అవకాశం ఉండేదని ఆయా పార్టీల నేతలు చెప్తున్నారు. ముసాయిదా జాబితాల కోసం అధికారులను సంప్రదిస్తే చేతికి ఇవ్వడం కుదరంటూ ఆయా కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని తేల్చిచెప్తున్నారు.
దీంతో ఓటర్ల జాబితాను పరిశీలించడం సామాన్య ఓటర్లకు సాధ్యమయ్యే పని కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులతో పాటు తాజా మాజీలైన కౌన్సిలర్లు మాత్రమే వీటిపై అంతో ఇంతో దృష్టి పెట్టి తప్పులను అధికారుల దృష్టికి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి తప్పులను సరిదిద్దే అవకాశం తక్కువే. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ప్రచురించే ఓటర్ల తుది జాబితా ఎలా ఉంటుందోనన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ముసాయిదా జాబితాలో దొర్లిన తప్పులను అధికారులు క్షేత్రస్థాయి పరిశీలించి ఏ మేరకు సరిదిద్దుతారో వేచి చూడాల్సిందే.