నల్లగొండ ప్రతినిధి,ఫిబ్రవరి12(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల పోరులో కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట లోపే నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల లెక్కింపు పూర్తవుతుందని అంచనా. అన్ని చోట్ల అన్నివార్డులకు ఒకేసారి కౌంటింగ్ చేపట్టనున్నారు. దీంతో అన్ని వార్డుల ఫలితాలు అరగంట అటుఇటుగా వెల్లడికానున్నాయి. చిన్న మున్సిపాలిటీల్లో కొన్ని వార్డుల్లో ఐదారువందల ఓట్లే పోల్ కావడంతో ఇవి పది గంట లోపే వెల్లడికావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
పట్టణ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనే సంగతి నేడు తేలనుంది. ఈనెల 11న పోలింగ్ జరగ్గా.. నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 162 వార్డులు ఉండగా.. హాలియాలో ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 161 వార్డుల ఫలితం నేడు తేలనుంది. నల్లగొండలో ఆర్జాలబావి సమీపంలోని స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ గౌడౌన్లో నల్లగొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. మిర్యాలగూడలో అవంతీపురం సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్యాలగూడ, హాలి యా, నందికొండ మున్సిపల్ ఓట్లను లెక్కిస్తారు. ఇక నల్లగొండలోని సాగర్ రూట్లోని పాత స్వామి రామానందతీర్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలోని సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో దేవరకొం డ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్నిచోట్ల పటిష్ట భద్రత మధ్య ఇప్పటికే సిద్ధం చేసిన కౌంటింగ్ హాళ్లలో లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కౌంటింగ్ సిబ్బంది 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. కౌంటింగ్ పాస్‌లు ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది, మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8గంటలకు ముందుగా స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కోసం వార్డుల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్ల మీదకు చేరుస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యాక అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అప్పు డు ఆయా వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలకు సం బంధించిన బ్యాలెట్ బాక్స్‌లను ఒక్కొక్కటి చొప్పున ఓపెన్ చేస్తారు. వాటిల్లోని బ్యాలెట్ పేపర్లను టేబుళ్లపై పేర్చి ముందుగా 25 బ్యాలెట్లను ఒక బండిల్ చొప్పున కట్టలుగా విభజిస్తారు. వీటన్నింటినీ ఆ టేబుల్ వద్ద ఏర్పాటు చేసిన డ్రమ్ములో వేస్తారు. ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కించేలా 40 బండిల్స్‌ను ఒక్కో టేబుల్‌కు పంచుతారు. ఇలా ఓట్లన్నీ లెక్కిస్తారు. అయితే నల్లగొండ, మిర్యాలగూడలో మాత్రమే ఒక్కో వార్డులో పోలైన ఓట్లను బట్టి రెండు నుంచి మూడు రౌండ్స్‌లో ఓట్ల లెక్కింపు కానుంది. దేవరకొండలో రెండు రౌండ్లు, మిగతా చోట్ల ఒక్కో రౌండ్(వెయ్యి లోపే ఉంటాయి కాబట్టి)లో లెక్కింపు పూర్తి అవుతుందని అధికారులు వెల్లడించారు.
గత ఎన్నికల్లో నల్లగొండ, మిర్యాలగూడకు సంబంధించి 16 టేబుళ్లను ఏర్పాటు చేసి ఒక్కో రౌండ్లో 16వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మూడు దఫాలుగా మొత్తం 48వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. దీంతో ఇక్కడ అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి సాయంత్రం 4గంటలు దాటింది. కానీ ఈసారి ఒకేసారి నాలుగు కౌంటింగ్ హాళ్లలో 48వార్డులకు 48 టేబుళ్లను ఏర్పాటు చేయడంతో అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు ఏకకాలంలో పూర్తికానుంది. దీంతో నల్లగొండ, మిర్యాలగూడ ఫలితాలు మధ్యాహ్నం 12గంటలకు అటుఇటుగా వెల్లడి కానున్నట్లు అంచనా.మిగతా మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఒక్కో వార్డులో వెయ్యి ఓట్లలోపే ఉండడంతో ఉద యం 11గంటల లోపే పూర్తి ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్ల నియాయాకం కూడా పూర్తయింది. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా, సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇప్పటికే పలు దఫాలుగా కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేలా జాగ్రత్తలు చేపట్టామన్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు సకాలంలో వచ్చి కౌంటింగ్ నిబంధనలకు అనుగుణంగా సహకరించాలన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వల్ల బందోబస్తును పర్యవేక్షిస్తూ మూడెంచల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరికీ పాసులు ఉంటేనే లోనికి అనుమతిస్తామని, ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు.
నేడు ఓట్ల లెక్కింపులో వార్డుల వారీగా విజేతలు తేలనుండటంతో రెండు రోజుల విరామం అనంతరం ఈనెల 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 12.30కు ముందుగా ఎన్నికైన కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక పూర్తి చేస్తారు. తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ఇదే పద్ధతిలో నిర్వహిస్తారు. శుక్రవారం కౌంటింగ్ పూర్తి కాగానే ప్రధా న పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమచారం. రెండు రోజుల క్యాంపు అనంతరం ఈనెల16న ఉదయం నేరుగా ఎన్నిక నిర్వహించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాళ్లకు చేరుకునేలా ముందుస్తు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. అయితే ఫలితాలపై ఎవరి ధీమాలో వారు ఉండటంతో తీవ్ర ఉత్కంఠత రేకెత్తిస్తోంది.