చండూరు, జూన్ 12 : మున్సిపాలిటీకి చెందిన ప్రజా ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ చైతన్య వెంచర్‌కు సంబంధించిన లేఅవుట్ ఆమోదం సమయంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, ప్రజా ప్రయోజనాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మొత్తం విస్తీర్ణంలో 10% భూమిని మున్సిపాలిటీకి కేటాయించడం జరిగిందన్నారు. ఈ మేరకు 5,042 గజాల భూమి చండూరు మున్సిపాలిటీకి అప్పగించారని తెలిపారు. అయితే కాలక్రమేణా మున్సిపాలిటీకి చెందిన ఈ భూమిలో కొంత భాగాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి తదనంతరం క్రయవిక్రయాలకు పాల్పడినట్లు గుర్తించబడిందని, మున్సిపాలిటీ ఆస్తిగా ఉన్న భూమిని వ్యక్తిగత ఆస్తిగా చూపిస్తూ విక్రయాలు చేశారని పేర్కొన్నారు.

మున్సిపాలిటీ ఆస్తుల రక్షణ ప్రతి పౌరుడి బాధ్యత : చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం
ఈ నేపథ్యంలో చండూరు మున్సిపాలిటీ అధికారులు సంబంధిత భూమికి సంబంధించిన రికార్డులు, లేఅవుట్ పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి, శుక్రవారం అక్రమ ఆక్రమణలను తొలగించి, సంబంధిత భూమినీ మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో భవిష్యత్‌లో మరలా ఎటువంటి అక్రమ ఆక్రమణలు, అనధికారిక క్రయవిక్రయాలు జరగకుండా ఉండేందుకు ఆ స్థలానికి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఇది చండూరు మున్సిపాలిటీకి చెందిన ఆస్తి అని స్పష్టంగా తెలియజేస్తూ నేమ్ బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చర్యల ద్వారా మున్సిపాలిటీ ఆస్తులను పరిరక్షించడం, ప్రజా ప్రయోజనాలను కాపాడడం, ప్రభుత్వ భూములపై అక్రమ కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా చర్యలు చేపట్టామని, మున్సిపాలిటీకి చెందిన ప్రజా ఆస్తుల రక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. కావున ఇటువంటి భూములపై ఎవరైనా అనధికారికంగా ఆక్రమణలు చేయడం, క్రయవిక్రయాలు నిర్వహించడం లేదా మున్సిపాలిటీ హక్కులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.