నార్కట్పల్లి, అక్టోబర్ 20 : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ రూపొందించిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగనుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి శుక్రవారం నార్కట్పల్లిలో భారీ రోడ్డు షో నిర్వహించారు. పట్టణంలోని మహిళలు కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యేకు మంగళహారతులతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అధికార దాహం తప్ప అభివృద్ధ్దిపై ఎలాంటి ఎజెండా లేదని అన్నారు. నోరు తెరిస్తే అన్ని అబద్దాల మాటలు 6 గ్యారెంటీలు అంటూ కొత్త ఎత్తు వేసుకొని వస్తున్నారని వారికి ఓటు ద్వారా తగిన బుద్ధ్ది చెప్పాలన్నారు. నకిరేకల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని అది కేవలం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వల్లనే సాధ్యమైందని అన్నారు. చిరుమర్తి లింగయ్య ఎంతో మంచి సౌమ్యుడని ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కనుక కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నార్కట్పల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్, డివైడర్ రూ.16 కోట్లతో పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారిపోతాయన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు 100 శాతం పూర్తయ్యాయన్నారు. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్ చదివేందుకు ఎంతో ఇబ్బందులు పడొద్దని ఇంటర్ కళాశాల ఏర్పాటు చేశామని విద్యార్థుల సంఖ్యకూడా గణనీయంగా పెరిగిందన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారాను తప్ప స్వలాభం కోసం కాదన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రారంభమైన బ్రాహ్మణవెల్లెంల, ఉదయ సముద్రం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పూర్తి చేశామని అది తమ చిరకాల వాంఛ అన్నారు. కేసీఆర్ సహకరంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచానని ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. సొంత మండలం వాడిని కనుక మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక పావనీశ్రీధర్, పట్టణాధ్యక్షుడు దోసపాటి విష్ణు, కోఆప్షన్ సభ్యులు వాజిద్, మేడబోయిన శ్రీనివాస్, పుల్లెంల మహేశ్, వెంకట్,నాగరాజు, నడింపల్లి మహేశ్ పాల్గొన్నారు.
నకిరేకల్ : నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని ప్రధాన రహదారి, కూడలిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రచా రం నిర్వహించారు.
నకిరేకల్ : ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నోముల గ్రామస్తులు నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుడి నిర్మాణంతో పాటు మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో నోముల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.