యాదవులకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, సీఎం కేసీఆర్ పాలనలోనే యాదవులకు అన్ని రంగాల్లో గుర్తింపు లభించిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కృషితో సూర్యాపేట జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. యాదవుల ఆరాధ్యదైవమైన పెద్దగట్టు లింగమంతుల స్వరూపం మంత్రి జగదీశ్‌రెడ్డి అని, ఆయన సహకారంతోనే యాదవులకు ఎంపీ, డీసీఎంఎస్ చైర్మన్, ఇతర ప్రధాన పదవులు వచ్చాయని తెలిపారు. సూర్యాపేటలో శుక్రవారం యాదవుల ఆత్మీయ సమావేశానికి ఎంపీ బడుగుల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగా మంత్రిపై ఆరోపణలు చేస్తున్న వారు ఆ ధోరణి మానుకోవాలని, బీఆర్ఎస్లో ఉంటూ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. అలాంటి వ్యకుల మాయమాటలు నమ్మకుండా యాదవులమంతా కలిసికట్టుగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు. కాగా, తామంతా మంత్రి జగదీశ్‌రెడ్డి వెంటే ఉంటామని, గుంటకండ్లకే తమ మద్దతు అని యాదవ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఏకగీవ్ర తీర్మానం చేశారు.
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 1 : యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, బీఆర్ఎస్ పాలనలోనే యాదవులకు తగిన గుర్తింపు లభించిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని పబ్లిక్‌క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు యాదవులకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ మాత్రమే గుర్తించి అనేక విధాలుగా వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.
వందలకోట్లు ఇచ్చినా రాని రాజ్యసభ సభ్యుడి పదవిని ఒక చాయ్ ఖర్చు లేకుండా సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో తనకు ఇచ్చారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడంతో పాటు మరో రూ. 50కోట్లు అదనంగా జిల్లా కేంద్రానికి తెచ్చుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే కాకుండా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సూర్యాపేట జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, జడ్పీ వైస్ చైర్మన్‌గా, జనరల్ స్థానంలోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నియమించిన ఘనత మంత్రి జగదీశ్‌రెడ్డిదే అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి యాదవబిడ్డకు ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా నియమించారన్నారు.
తప్పులు జరిగినప్పుడు నష్టపోయిన వారిని, మన వల్ల కష్టాలపాలైన వారిని కాపాడాలని మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని ఓడించారని, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గెలువనీయడం లేదనే కోపంతో వారు మంత్రి జగదీశ్‌రెడ్డిని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉంటూ పార్టీని దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేపు వచ్చేది సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అని, మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టే అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మకుండా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో యాదవులమంతా కలసికట్టుగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు.
ఆత్మీయ సమావేశానికి వందలాదిగా తరలివచ్చిన యాదవవులు కబ్జాకోరు వద్దు జగదీశ్ అన్న ముద్దు అంటూ నినదించారు. మంత్రి జగదీశ్‌రెడ్డికి మద్దతుగా, ఆయన వెంటే ఉంటామంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇద్దరు శాసనసభ్యులను, రాజ్యసభ సభ్యుడి పదవిని యాదవులకు ఇప్పించడం యాదవుల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనమన్నారు. సమావేశంలో యాదవ ప్రజా ప్రతినిధులు, నాయకులు దావుల వీరప్రసాద్‌యాదవ్, మన్నె లక్ష్మీనర్సయ్య, కోడి సైదులు, జటంగి వెంకటేశ్వర్లు, సౌడయ్య, గొడ్డేటి సైదులు, కడారి సతీశ్‌యాదవ్, మట్ట రాజు, మద్ది శ్రీనివాస్, మండాది కృష్ణతో పాటు ఆయా మండలాల యాదవ ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.