మునుగోడు ,మార్చి 27 : తెలంగాణ ఉద్యమ కళాకారులకు రాష్ట్ర సాంస్కృతిక సారధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు అన్నారు. సంఘం పిలుపు మేరకు గురువారం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగయ్య ఆధ్వర్యంలోమునుగోడు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారులు కాళ్లకు గజ్జలు కట్టి, భుజాన గొంగడి వేసుకుని, కడుపులు మాడ్చుకుని, ఇల్లు వాకిలి వదిలి, రాత్రనకా పగలనకా తమ ఆటపాటలతో తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు ఉద్యమించినట్లు తెలిపారు.
వనం లింగయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ.. కళాకారులకు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కళాకారుల సమస్యలపై శాసనసభలో మాట్లాడిన సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి నల్లగొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి భీం ప్రసాద్, మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రడం నర్సింగరావు, నియోజకవర్గ నాయకులు శివరాత్రి రాములు, గంట నగేశ్, మేడి సైదులు, గోస్కొండ మారయ్య పాల్గొన్నారు.