మోత్కూరు, అక్టోబర్ 14: తమ భూముల్లో నుంచి కాల్వ తవ్వి ఉపాధిని దెబ్బతీయవద్దంటూ మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. అడ్డగూడూరు మండలంలోని ధర్మారం చెరువు వరకు చేపట్టనున్న బునాదిగాని కాల్వ తవ్వకం పనులు చేపట్టేందుకు భూసేకరణకు వచ్చిన అధికారులను పాటిమట్ల రైతులు మంగళవారం అడ్డుకున్నారు. గ్రామంలోని 20,89,92,93,95,96,111,116,119 సర్వేనంబర్లలో 17.24 ఎకరాల భూమిలో కాల్వ పనులు చేపట్టేందుకు అధికారులు సర్వే చేసేందుకు పాటిమట్ల వచ్చారు. దీంతో జిల్లా భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ జగన్నాధరావు, డిప్యూటీ తహసీల్దార్ జైపాల్‌రెడ్డి, డీఐ రాధాకృష్ణ, మండల తహసీల్దార్ జ్యోతిని రైతులు అడ్డుకున్నారు.
పేదలమైన తమ వ్యవసాయ భూముల్లో నుంచి కాల్వ తవ్వడం వల్ల 30 మంది కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయన్నారు. తమ భూముల్లో నుంచి కాల్వను తవ్వవద్దని రైతులు ఆందోళనకు దిగారు. గ్రామానికి కిలో మీటరు దూరం నుంచి కాల్వను తవ్వితే తమకేమీ అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తమ పొట్ట కొట్టవద్దంటూ అధికారులను వేడుకున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే గ్రామంలో సర్వే చేస్తున్నామని అధికారులు తెలిపారు.
గ్రామంలోని పలు సర్వే నంబర్ల నుంచి భూమిని సేకరించి సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి విన్నవించుకోవాలని డిప్యూటీ కలెక్టర్ జగన్నాధరావు రైతులకు సూచించారు. తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులను మోత్కూరు సీఐ వెంకటేశ్వర్లు పోలీసులతో వచ్చి అడ్డుకున్నారు. సర్వే పనులు అడ్డుకుంటే కేసులు పెడ్తామని రైతులను బెదిరించారు. పోలీసుల పహారాలో అధికారులు సర్వేను చేపట్టారు. కార్యక్రమంలో ఆర్ఐ సుమన్, ఫారెస్టు అధికారి మల్లేశ్ ఇతర సిబ్బంది నర్సింహ, తరుణ్, సర్వేయర్ ఫరీద్ పాల్గొన్నారు.