– 10 నెలలుగా గదిలోనే నరకయాతన
– బతికించండని గది కిటికీ నుండి ఆక్రందనలు
– స్థానికుల చొరవతో చెర వీడిన అన్నపూర్ణమ్మ
– కోడలు, మనవడు, మనవరాలకు దేహశుద్ధి చేసిన స్థానికులు
– కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు
కోదాడ, జనవరి 10 : నవ మాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచి, ఉన్న ఆస్తిని తెగనమ్మి రెండంతస్తుల భవనం నిర్మించి కొడుకుకు కట్టబెడితే కన్న పేగు బంధాన్ని మరిచి కన్నతల్లిని ఓ కుమారుడు చిత్రహింసలు పాలు చేసిన అమానవీయ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన ముక్కన శ్రీనివాస్‌రెడ్డి గత పది సంవత్సరాల క్రితం కోదాడలో స్థిరపడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండలో గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడైన శ్రీనివాస్‌రెడ్డి తండ్రి, తల్లి అన్నపూర్ణమ్మ తమ సొంత గ్రామంలోని ఆస్తులను అమ్మి రూ.2 కోట్లతో కోదాడలో కొడుకు(శ్రీనివాస్‌రెడ్డి) కు రెండు అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు.
అయితే రెండు సంవత్సరాల క్రితం భర్త కన్నుమూయడంతో అన్నపూర్ణమ్మ కొడుకు దగ్గరే జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో తన కుటుంబానికి తల్లి అన్నపూర్ణమ్మ చేతబడి చేయించిందని కొడుకు, కోడలు భావించి భూత వైద్యుడిని పిలిపించి పూజలు చేయించారు. అన్నపూర్ణమ్మే చేతబడి చేయించిందని శ్రీనివాస్‌రెడ్డి భార్య, కొడుకు, కోడలు పది నెలల నుండి ముసలమ్మను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. దీంతో పాటు ప్రతిరోజు కిటికీ నుండి అన్నం పెట్టేవారు. ఈ పరిస్థితిలో శనివారం సదరు ఇంటి గది కిటికీ నుండి కేకలు వినపడడం స్థానికులు గమనించారు. తీరా వెళ్లి చూడగా అన్నపూర్ణమ్మ ఆవేదనతో ప్రతిరోజు కోడలు, మనవడు, మనవరాలు నరకయాతన చూపిస్తున్నారని, చిత్రహింసలు పెడుతున్నారని తనను రక్షించండి అని వేడుకుంది.
ఇది గమనించిన ఆమె కోడలు, మనవడు, మనవరాలు తమ ఇంట్లోకి రావడానికి వీల్లేదని అడ్డుపడడంతో స్థానికులకు వారితో కొద్దిసేపు వాగ్వాదం తలెత్తింది. ఈ ఘర్షణలో మనవడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. దీంతో చేసేదిలేక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కొడుకు, కోడలు, భార్యపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గత పది నెలల నుండి చేతబడి నెపంతో తనను కోడలు, మనవడు, మనవరాలు చిత్రహింసలు పెడుతున్నారని, తనకు నెల వారి వచ్చే రూ.38 వేల పెన్షన్ వాళ్లే తీసుకుంటున్నారని విలేకరుల ఎదుట అన్నపూర్ణమ్మ కన్నీటి పర్యంతమైంది. వారి నుండి తనను కాపాడాలని వేడుకోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Kodada : చేతబడి నెపంతో కన్నతల్లికి చిత్రహింసలు