యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): మదర్ డెయిరీని కష్టాలు వీడటంలేదు. స్వయంగా సీఎం చొరవ తీసుకున్నా డెయిరీకి ఇబ్బందులు తప్పడంలేదు. ఎన్డీడీబీకి డెయిరీని అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎన్వోసీ రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇంకో వైపు పాడి రైతులకు పాల బిల్లుల చెల్లింపులే లేవు. రోజువారీ పాల సేకరణ గణనీయంగా పడిపోయింది. నార్ముల్ ఉద్యోగుల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. చిట్యాలలో ఉన్న డెయిరీ ఆస్తులను అగ్గువకే కట్టబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మదర్ డెయిరీ ఒకప్పుడు వెలుగు వెలిగింది. యాదాద్రి జిల్లాలో అధిక శాతం మంది రైతులు పాడి పరిశ్రమపైనే ఆధార పడి ఉన్నా రు. నార్ముల్ మూడున్నర దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా నిలుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 24 చిల్లింగ్ సెం టర్లు ఉన్నాయి. 32వేల మంది సభ్యులు ఉన్నారు. 432 సొసైటీల ద్వారా పాల సేకరణ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి నిత్యం 1.20 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది. 3 లక్షల మంది వినియోగదారులకు పాలు, పాల ఆధారిత ఉత్పత్తులను అం దించేది.
కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. సంస్థ నష్టాలు, అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రతి రోజూ పాల సేకరణ 15 వేల లీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. రైతుల నుంచి పాలు రాకపోవడంతో ఎక్కువ ధరతో ప్రైవేట్ డెయిరీల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణంగా రైతులకు లీటరుకు రూ.30 నుంచి రూ.35 మా త్రమే ఇస్తారు. కానీ ప్రస్తుతం బయట లీటరుకు రూ.44 చెల్లిస్తున్నట్లు తెలిసింది. నిత్యం 40వేల లీటర్ల వరకు కొనుగోలు చేస్తున్నారు.
డెయిరీలో రైతులకు పాల బిల్లులు చెల్లించడమే గగనమైంది. ఏకంగా సెప్టెంబర్ నుంచి 15 బిల్లులు పెండింగ్లో మూలుగుతున్నా యి. గతంలో 15 రోజులకోసారి బిల్లుల చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఏడు నెలలవుతున్నా రైతుల ఖాతాల్లో పైసలు జమ చేయడంలేదు. మొత్తంగా రూ. 25 కోట్ల బకాయి ఉంది. దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాణా ధరలు పెరగడంతోపాటు చేతిలో డబ్బుల్లేక అరిగోస పడుతున్నారు. ఉద్యోగులకు సైతం మూడు నెలలుగా సుమా రు రూ. 5కోట్ల మేర జీతాలు చెల్లించడంలేదు. ఒక్కో నెల రూ.1.70 కోట్లు జీతా లు చెల్లించాల్సి ఉంటుంది. జీతాల గురించి గట్టిగా అడిగితే ఎక్కడ ఉద్యోగాలకు ముప్పు వస్తుందోననే భయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
కష్టాల్లో ఉన్న మదర్ డెయిరీని ఆదుకోవడానికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)కు అప్పగించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా సీఎం స్వయంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎం పీలు, కార్పొరేషన్ చైర్మన్న్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎన్డీడీబీకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల బృందం ఇతర రాష్ర్టాలకు వెళ్లి అధ్యయనం చేసింది. ఎన్డీడీబీ సైతం టేకోవర్ చేసుకోవడానికి సిద్ధమైంది. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎన్వోసీ రాలేదు. దీంతో అడుగులు ముందుకు పడటంలేదు.
నార్ముల్ పరిస్థితి రోజురోజుకు ప్రశ్నార్థకరంగా మారుతున్నది. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించని స్థాయికి చేరుకుంది. అయితే డెయిరీని కష్టాల నుంచి గట్టేక్కించేందుకు 15 ఏండ్ల పాటు ఎన్డీడీబీ అప్పగించనున్నారు. ఇందులో భాగంగా ఎన్డీడీబీ.. మదర్ డెయిరీకి లీటరుకు రూ. 6.50 కమీషన్ ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. అయితే ప్రస్తుతం కేవలం 15వేల లీటర్లలోపే పాల సేకరణ జరుగుతున్నది. ఈ లెక్కన ఎన్డీడీబీ ఇచ్చే కమీషన్ దేనికీ సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క ఉద్యోగులకే నెలకు రూ.1.70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగులకు 30 శాతం జీతాలు తగ్గిస్తామని ఎన్డీడీబీ ప్రతిపాదన పెట్టగా, పాలకవర్గం సమ్మితించినట్లు సమాచారం. మరోవైపు నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద ఉన్న డెయిరీకి చెందిన 29 ఎకరాల భూమిని సైతం నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 50 కోట్ల వరకు ధర పలుకుతుండగా, రూ. 42 కోట్లకే ఓకే చెప్పినట్లు తెలిసింది.
మదర్ డెయిరీని ఆదుకుంటామంటూ హడావిడి చేశారు. అంతా ఏదో జరిగిపోయినట్లు ఆర్భాటం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎన్డీడీబీకి ఎన్వోసీ రాని దుస్థితి. పాడి రైతులకు బిల్లులు ఇస్తామని, ఓపిక పట్టాలని డెయిరీ చైర్మన్ రాసిన లేఖలు ఏమయ్యాయి..? ఇంకా ఎన్ని రోజులకు డబ్బులు చెల్లిస్తారు. ఇయ్యాల ఎక్కువ ధరలకు బయట నుంచి పాలను కొనాల్సిన దుస్థితి దాపురించింది. పాలకవర్గం చేతగానితనం వల్లే 15వేల లీటర్లకు పాల సేకరణ పడిపోయింది. వెంటనే పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.
-దొంతిరి సోమిరెడ్డి, మదర్ డెయిరీ మాజీ డైరెక్టర్