శాలిగౌరారం, జులై 05 : అభం, శుభం ఎరుగని పసిపాపతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. శాలిగౌరారం ఎస్ఐ సైదులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగమర్తి గ్రామానికి చెందిన సింగారపు వాణి (25)ని రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి నాలుగేండ్ల క్రితం పెండ్లి చేశారు. వీరికి ఇద్దరు కూతుర్లు. ఇటీవలే వాణి తన చిన్న పాప (9 నెలలు)తో తల్లిగారి ఊరైన వంగమర్తికి వచ్చింది. శనివారం మధ్యాహ్నం సమయంలో తన కూతురును ఎత్తుకుని గ్రామ శివారులోని బావి వద్దకు చేరుకుంది. చంటి పాపతో సహా తాను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
చుట్టుపక్కల వారు గమనించి గ్రామస్తులు, పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలం వద్దకు చేరుకున్న వారు వెంటనే తల్లీబిడ్డల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి వాణి మృతధేహం లభ్యం కాగా పాప ఆచూకి లభ్యం కాలేదు. మృతురాలి బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వాణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానాకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వాణి మానసిక పరిస్థతి సరిగ్గా లేక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం.