మిర్యాలగూడ, మార్చి1 : దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారని ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మూడు రోజుల పాటు జరిగే గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలోని హనుమాన్‌పేట నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా అందించాల్సిన ఆహార పదార్థాలను ఇవ్వకుండా రేషన్ దుకాణాలను ఎత్తివేసే ఆలోచనలో ప్రధాని ఉన్నారన్నారు. డిజిటల్ ఇండియాగా చెప్పుకునే మన దేశంలోని గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇంటర్నెట్, ఆన్లైన్ సౌకర్యం లేక కరోనా సమయంలో చదువుకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సీటీలకు కేంద్రం బడ్జెట్లో కేవలం రూ.కోటి మాత్రమే కేటాయించిందని, దీనిని బట్టి చూస్తే గిరిజనుల పట్ల ప్రధాని మోదీకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. మహాసభల వేదిక నుంచే ప్రధాని మోదీ ప్రభుత్వ పతనానికి సమరశీల పోరాటాలు ప్రారంభిస్తామన్నారు.
మోదీ, అదానీ బంధం దేశానికి ప్రమాదకరం
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అదానీల బంధం దేశానికి ప్రమాదకరంగా మారిందన్నారు. దేశ సంపదను బడా బాబులకు అప్పణంగా అప్పగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజా ఉద్యమాల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులకు ఇవ్వని మాఫీలు కార్పొరేట్లకు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారన్నారు. నిత్యవసర సరుకుల ధరల నియంత్రణపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాంనాయక్ మాట్లాడారు. సమావేశం లో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, సీఐటీయూ నాయకులు డబ్బికార్ మల్లేశ్, తుమ్మల వీరారెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధీరావత్ రవినాయక్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవినాయక్, శంకర్‌నాయక్, రైతుసంఘం రాష్ట్ర నాయకుడు మల్లు నాగార్జున్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.