హుజూర్నగర్, డిసెంబర్ 23 : హుజూర్నగర్ మోడల్ కాలనీలోని ఇండ్లను మూడు నెలల్లో పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేస్తామని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన మోడల్ కాలనీ ఇండ్లను శనివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని హుజూర్‌నగర్‌లోని 2,160 ఇండ్లను గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన 33 ఎకరాల్లో కొత్త ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతామని చెప్పారు. పేదలకు అత్యధిక ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని లిఫ్ట్‌లను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధులను తక్షణమే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని అన్నారు. అంతకుముందు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ వెంకట్రావ్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్‌రెడ్డి, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ రమేశ్, హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, పీడీ కిరణ్‌కుమార్, డీపీఓ యాదయ్య, సీపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైరపర్సన్ గెల్లి అర్చన, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, తాసీదార్లు నాగార్జునరెడ్డి, శ్రీదేవి, మంగ, జ్యోతి, కవిత, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సీడీపీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.