మునుగోడు ఏప్రిల్ 24: భూముల పరిష్కారానికి తీసుకొచ్చిన భూభారతి చట్టమని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టం 2025 చట్టం పైన అవగాహన సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందన్నారు. నల్గొండ ప్రాంతంలో భూముల కోసం పోరాటం చేసిన సంఘటనలు ఉన్నాయని, భూదాన్ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు, అన్ని రకాల భూములు నల్గొండలో ఉన్నాయన్నారు.
భూములు ఎక్కువగా ఉన్నచోట సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని, అయితే భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మునుగోడు ప్రాంతం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్నందున వాగులే ఆధారంగా ఉన్నాయని, అయితే ఈ మధ్యకాలంలో వాగులు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
అలాగే మునుగోడు అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ప్రాజెక్టులను తీసుకొచ్చి పూర్తిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మునుగోడు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో శాంత కుమారి, డిప్యూటీ తాసిల్దార్ నరేష్ ,పలు శాఖల అధికారులు పాల్గొన్నారు