భువనగిరిక లెక్టరేట్, ఫిబ్రవరి 13 : సాగు నీరు లేక జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడింది శూన్యమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశంతో కలిసి గురువారం భువనగిరిలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబాటుకు గురైందన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకమూ అమలుకు నోచడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా వ్యతిరేకతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఎక్కువయ్యాయని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆలేరుకు గోదావరి జలాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్పచ్చమైన తాగునీరును అందించిన అపర భగీరధుడు కేసీఆర్ అని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. ఎంప్లాయిస్, ఎడ్యుకేషన్, పొలిటికల్‌కు వేర్వేరు బిల్లులను పెట్టి చట్టబద్ధత కల్పించాలని, న్యాయస్థానాలకు వెళ్లినా ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాత్మకంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే కాంగ్రెస్ బీసీల ద్రోహిగా మిగిలిపోతుందని హెచ్చరించారు. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అండ గా ఉండడంతోపాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
గురుకులాల్లో వసతులు కరువయ్యాయని, కలుషిత ఆహారం, అనారోగ్య సమస్యలతో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే ప్రజలు విసిగి వేశారని, రానున్న కాలంలో బీఆర్ఎస్ను ప్రజలు గుండెల్లో పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీలు సుబ్బూరు బీరు మల్లయ్య, తోటకూరి అనూరాధ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ర్యాకల శ్రీనివాస్, ఏవీ కిరణ్‌కుమార్, జాగృతి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సుజిత్‌రావు, నాయకులు తంగెళ్లపల్లి శ్రీకాంత్, మచ్చ చక్రవర్తి పాల్గొన్నారు.