నల్లగొండ, అడ్డగూడూర్, గుడిపల్లి, భూదాన్ పోచంపల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ను అమలు చేశారు. మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయా మండలాల తాహసీల్దార్లు, ఆర్డీవోలు పర్యవేక్షిస్తున్నారు.
అడ్డగూడూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 18 మంది ఓటర్లు ఉండగా ఉదయం 11 గంటల వరకు ఆరుగురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పీఏ పల్లి, గుడిపల్లి మండలాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పీఏ పల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రంలో 35 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదేవిధంగా గుడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో 12 మంది ఓటు వేయనున్నారు.
భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆ పోలింగ్ కేంద్రాన్ని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ ఏసీపీ మధు సూధన్రెడ్డి పరిశీలించారు.