నల్లగొండ ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8గంటలకు మొదలు కానుంది. నల్లగొండ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి భిన్నంగా కొనసాగనుంది. ఓటింగ్‌లో ప్రాధాన్యతా ప్రకారం ఓటర్లు ఓటు వేయగా.. కౌంటింగ్ కూడా అదే విధంగా జరుగనుంది.
తొలి ప్రాధాన్యత ఓట్లను మొదలు లెక్కించి ఆ సమయంలోనే చెల్లని ఓట్లను పక్కకు వేస్తారు. చెల్లిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ విజేతకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లల్లో యాభై శాతం ప్లస్ ఒకటి కలిపి విజేతకు అవసరమైన గెలుపు కోటాను నిర్ధారిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఈ గెలుపు కోటాను అభ్యర్థులు సాధిస్తే సరేసరి. లేకుంటే ఎలిమినేషన్ పద్ధతిలో సుదీర్ఘంగా గెలుపు కోటా వచ్చే వరకు లెక్కింపు కొనసాగనుంది.
ఓట్ల లెక్కింపు సరిగ్గా రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. మొత్తం ఓటర్లలో 72.44శాతం ఓటింగ్‌తో మొత్తం 3,36,005 ఓట్లు పోలయ్యాయి. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగానే అధికారులు ముందుస్తుగానే కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం నాలుగు కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్లపై లెక్కింపు జరిగేలా చర్యలు చేపట్టారు. ఇలా మొత్తం కౌంటింగ్ కోసం 96 టేబుళ్లను వినియోగిస్తున్నారు. వీటిపై ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కట్టే కార్యక్రమం చేపడుతారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్‌కు ఒకటి ఇచ్చి ఓపెన్ చేస్తారు.
బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను టేబుల్‌పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ చేస్తారు. ఇలా మొత్తం బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి కట్టలు కడుతారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేస్తారు. ఎప్పటికప్పుడు వీటన్నింటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్ములో వేస్తారు. బండిల్ కార్యక్రమం పూర్తయ్యాక అసలు లెక్కింపు మొదలు కానుంది. అయితే.. ఈ బండిల్ కార్యక్రమానికే కనీసం ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇది కొనసాగుతుండవచ్చని అంచనా. ఆ తర్వాతే అసలు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు.
2021 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది. నల్లగొండ పరిధిలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాములలో 17న ఉదయం 8గంటలకు లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు 25 ఓట్లకు ఒక కట్టను కట్టే కార్యక్రమం కొనసాగింది. తర్వాత ఆరు గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. 19వ తేదీన తెల్లవారుజామున 4గంటల వరకు మొత్తం 34గంటల పాటు ఇదే కొనసాగింది. గెలుపు కోటా ఎవరికీ రాకపోవడంతో అక్కడి నుంచి ఎలిమినేషన్ కార్యక్రమం ప్రారంభించారు.
19న ఉదయం ఐదు గంటల నుంచి మొత్తం 71 మందిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమం కూడా సుదీర్ఘ సమయాన్ని తీసుకుంది. 20వ తేదీ రాత్రి 12గంటల వరకు సుమారు 44గంటల పాటు కొనసాగింది. ఇలా మొత్తం 90గంటలకు పైగా రికార్డు సుదీర్ఘ సమయం తీసుకుంది. అయితే అప్పుడు ఒక్కో రౌండ్లో 56టేబుళ్లపై 56వేల ఓట్లే లెక్కించారు. కానీ.. ప్రస్తుతం ఒక్కో రౌండ్లో 96 టేబుళ్లపై 96వేల ఓట్లు లెక్కించనుండడంతో ఈ సారి 48గంటల్లోనే ఫలితం తేలనుందని అంచనా వేస్తున్నారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. బుధవారం ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తామన్నారు. కౌంటింగ్ కోసం ఇప్పటికే సిబ్బంది నియామకం, శిక్షణ, లెక్కింపునకు అవసరమైన సామగ్రి సిద్ధం చేసినట్లు చెప్పారు.
లెక్కింపు ప్రారంభంలో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి 25చొప్పున కట్టలు కట్టి.. తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలవుతుందని తెలిపారు. ఆ తర్వాత కోటా నిర్ధారించి గెలుపు కోటా వచ్చే వరకు ఎలిమినేషన్ ప్రక్రియలో కౌంటింగ్ కొనసాగిస్తామన్నారు. అందుకు అనుగుణంగానే షిఫ్టుల వారీగా సిబ్బందిని విభజించి విధులు కేటాయించినట్లు తెలిపారు. కౌంటింగ్‌ను పూర్తి పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా చేపట్టేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామన్నారు.
అనుకున్న విధంగా మధ్యాహ్నం 2 గంటల వరకు బండిలింగ్ ప్రక్రియ ముగిస్తే.. తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే.. ఒక్కో టేబుల్‌కు 40 బండిల్స్ చొప్పున ఇస్తూ వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ఇలా మొత్తం 96 టేబుళ్లపై ఒక్కో రౌండ్లో 96వేల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఇలా చేపట్టే తొలి రౌండ్ ఫలితం రేపు సాయంత్రం 5గంటల వరకు వెలువడవచ్చని అంచనా. మొత్తం నాలుగు రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఫలితాలు పూర్తిగా వెల్లడి కానున్నాయి. ఒక్కో రౌండ్‌కు సగటున రెండు గంటల సమయం పట్టవచ్చని అంచనా.
ఇలా అర్ధరాత్రి 12గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావచ్చని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,36,005 ఓట్లు పోలైన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను కూడా వేరు చేస్తారు. చెల్లని ఓట్లను పక్కన వేసి చెల్లిన ఓట్ల నుంచే గెలుపు కోటాను నిర్ధారిస్తారు. మొత్తం చెల్లిన ఓట్లలో 50శాతం+1ను గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు మొత్తం ఓట్లల్లో 3లక్షలు చెల్లుబాటైతే అందులో సగం అంటే 1,50,000+1 = 1,50,001 ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేత అవుతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
తొలి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ చేపడుతారు. ఇది విభిన్నంగా కొనసాగనుంది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే సమయంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికైతే తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తాయో.. వారి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కించి ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. తొలి ఓట్లలో చివరి స్థానంలో నిలిచిన అభ్యర్థికి పోలైన ద్వితీయ ఓట్లు.. ఏ అభ్యర్థులు పొందినవి వారికి కేటాయిస్తారు.
ఇంకా కూడా కోటా రాకపోతే చివరి తక్కువ తొలి ప్రాధాన్యత వచ్చిన రెండో అభ్యర్థికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకుని మిగతా వారికి పంచేస్తారు. ఆయా అభ్యర్థుల తొలి ప్రాధాన్యత ఓట్లకు ఎలిమినేషన్ ప్రక్రియలో వస్తున్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కులుపుకొంటూ ముందుకు వెళుతారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గెలుపు కోటా వచ్చే వరకు కింది నుంచి పైకి అందరి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ వెళ్తారు.
ఈ క్రమంలో ఎక్కడైనా ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్‌ను నిలిపివేసి విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించక తప్పదు. మళ్లీ ద్వితీయ ఓట్లు లెక్కించిన తరహాలోనే ఈ ప్రక్రియ సాగుతుంది. కాకపోతే ఇప్పటి వరకు తొలి ప్రాధాన్యతలో తేలకపోతే ద్వితీయ ప్రాధాన్యతతో గెలుపు సాధించిన సంఘటనలే ఉన్నాయి. తృతీయ ప్రాధాన్యత వరకు లెక్కింపు వెళ్లిన దాఖలాలు లేవని తెలుస్తోంది.