చండూరు, జులై 01 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. చండూరు మండల కేంద్రంలో వెంకన్నకు చెందిన భవన సముదాయాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం కూల్చివేశారు. దీనిపై ఆయన మీడియా మాట్లాడారు. తాను బీసీ నాయకుడి కాబట్టే తన ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కక్ష గట్టి తన భవనాన్ని కూల్చి వేసినట్లు తెలిపారు. తాను లేని సమయం చూసి మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా భవనాన్ని కూల్చివేసినట్లు చెప్పారు.
రోడ్డును ఒక్కో వైపు 40 ఫీట్లకు అధికారులు నిర్ణయించగా తాను 43 ఫీట్ల దూరంలో భవనాన్ని నిర్మించానని, అయినప్పటికి అధికారులు కూల్చి వేయడం నిబంధనలకు విరుద్ధం అన్నారు. చండూరులో నిర్మిస్తున్న రోడ్డు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని, బస్టాండ్ దగ్గర ఒక విధంగా, ఇక్కడ మరో విధంగా, అంగడిపేట రోడ్లో ఇంకో విధంగా వారి ఇష్టారీతిగా విస్తరణ పనులు చేస్తున్నట్లు చెప్పారు. అంతట ఒకేలాగా నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా తన పక్కనే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గృహ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకుని అక్రమంగా వ్యాపార సముదాయం నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
అధికార పార్టీ నాయకులకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కమీషన్లు ఇస్తే అక్కడ తక్కువ వెడల్పులో రోడ్డు నిర్మిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. చండూరులో ఎక్కడా లేని విధంగా రాజకీయాలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఇలాంటి కక్ష సాధింపులు చర్యలకు తాము దిగితే వాళ్ల నాయకులు ఇక్కడ తిరిగేవారు కాదన్నారు. ఇలాంటి సంస్కృతి వారు మొదలుపెట్టారని, భవిష్యత్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తనకు జరిగిన అన్యాయన్ని ప్రజలు గమనిస్తున్నారని న్యాయం కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Chandur : నాపై ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కక్ష కట్టారు : చండూరు మాజీ ఎంపీపీ