నల్లగొండ ప్రతినిధి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను సమీక్షించుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి సీటుతో సహా మెజార్టీ స్థానాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరున్నా అంతా సమన్వయంతో గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటే అవకాశం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రానున్న కాలం తిరిగి బీఆర్ఎస్దేనని, అధినేత కేసీఆర్ సారథ్యంలో పార్టీని ఆ దిశగా నడిపిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థా యి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేటీఆర్ ము ఖ్య అతిథిగా పాల్గొనగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, కీలక నేతలంతా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదంటూ భవిష్యత్ అంతా గులాబీ పార్టీదేనని అన్నారు.
భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఫలితాలపై కేటీఆర్ సమీక్షించారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ.. గెలుపోటముల కారణాలపై పార్టీ నేతల నుంచి ఆరా తీశారు. పార్టీ నాయకులు, శ్రేణుల కృషి, ప్రచారం.. ప్రజల భావన తదితర అంశాలపై పార్టీ నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. ‘బీఆర్ఎస్ను ప్రజలు నిర్విద్వంగా తిరస్కరించలేదు.
ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫలితాల్లో మాత్రం భిన్నత్వాన్ని చూపించారు. రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి నియోజకవర్గంలో 15వేలకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చాం. అయినా ఇలాంటి వాటిని జనంలోకి తీసుకపోలేక పోయాం. ఎందుకిలా జరిగిందో విశ్లేషించుకుందాం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ లోటుపాట్లను సమీక్షించుకోవడం ద్వారానే లోక్‌సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం కాగలమని చెప్పారు.
తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి భువనగిరి లోక్‌సభ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలు హాజరయ్యారు. సుమారు వెయ్యి మంది వరకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం 11:50 గంటలకు ప్రారంభమైన సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. హాల్లోకి వెళ్లే ముందు నాయకుల వివరాలను రిజిస్టర్ చేసుకున్నారు. కాంగ్రెస్ చేసిన 420 హామీల వివరాలతో కూడిన బుక్‌ను అందించారు. మధ్యలో అరగంట పాటు లంచ్ బ్రేక్ అనంతరం తిరిగి సమావేశం కొనసాగించారు.
సాయంత్రం 6:20 గంటల వరకు సమావేశం నాన్‌స్టాప్‌గా కొనసాగింది. వేదిక మీద ఉన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడి, ఇతర ముఖ్య నేతలతోపాటు వేదిక కింద ఉన్న పార్టీ నాయకులు సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. చివరగా కేటీఆర్ స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల మద్దతుతో ఎండగడుతూ నిలదీయాలని కేటీఆర్ సూచించారు. ‘కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఉంటే.. ప్రభుత్వ పెద్దలే రెచ్చగొడుతున్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ఉద్దేశపూర్వకంగా కవ్వించారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మనం కూడా గట్టిగా సమాధానం చెప్పక తప్పని స్థితి కల్పించారు. అందులో భాగంగా కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పకొట్టాల్సి వస్తుంది. గెలుస్తామనే విశ్వాసం లేని స్థితిలో.. అధికారం కోసం అర్రులు చాచి.. అలవికాని హామీలిచ్చి.
నేడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేసే క్రమంలో శ్వేతపత్రాల పేరుతో నాటకాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. ఎస్సీ, బీసీ, మహిళా తదితర డిక్లరేషన్లతో కలిపి అవి సరిగ్గా 420 ఉన్నాయి. తక్షణమే రైతుబంధు, రుణమాఫీ, ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కాంగ్రెస్ మోసపూరితర వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో వాటిని ప్రజలకు వివరించడంలో ఫెయిలయ్యాం. ఇప్పటికైనా వాటిని నెరవేర్చేలా పోరాటాలు చేద్దాం. కేసీఆర్ తయారు చేసిన జగదీశ్‌రెడ్డి, తమ వంటి కార్యకర్తలే అసెంబ్లీలో దీటుగా తిప్పకొడితే.. త్వరలో స్వయంగా కేసీఆరే వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించండి’ అంటూ కేటీఆర్ అన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు రేపటి నుంచి ఈ నెల 16 వరకు విరామం. మళ్లీ 17నుంచి యథావిధిగా సమావేశాలు కొనసాగుతాయి. దీంతో ఈ నెల 16న జరుగాల్సిన నల్లగొండ పార్లమెంటు సన్నాహక సమావేశం ఈ నెల 22కు వాయిదా పడింది.
బీఆర్ఎస్ నిజమైన సెక్యులర్ పార్టీ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రానున్న రోజుల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతామని తెలిపారు. పార్టీనే సుప్రీం అనేలా యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలని, పార్టీలో క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా పార్టీ యావత్తు అండగా ఉండే పద్ధతిని నేతలు అవలంబించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రొటోకాల్ ఉల్లంఘనలు సీరియస్‌గా తీసుకుంటామని, తప్పుడు కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, గుజ్జ దీపికాయుగేంధర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజుయాదవ్, పల్లె రవికుమార్‌గౌడ్, రాజీవ్ సాగర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.