దేవరకొండ రూరల్(దేవరకొండ), మే10 : ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయన్నారు. నాటి ప్రభుత్వానికి, నేటి కాంగ్రెస్ సర్కారు పాలనకు ప్రజలు తేడా గమనించాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రంలోగానీ, పార్లమెంట్లోగానీ కొట్లాడి నిధులు తెచ్చుకోవచ్చని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటే అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అది చేస్తాం, ఇదిచేస్తాం అని ఏవేవో హామీలతో ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసపుచ్చారని, గద్దెనెక్కిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేశారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బీజేపీకి ఓటు వేస్తే ఆగమవుతామని హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాడే కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు విజయసింహారావు, రమేశ్‌నాయక్, బిల్యానాయక్, కిషన్‌నాయక్, పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, గాజుల ఆంజనేయులు, అంజిగౌడ్ పాల్గొన్నారు.