Saddula Bathukamma | రామగిరి/సూర్యాపేట టౌన్, అక్టోబర్ 10 : పుడమి తల్లి పూల శోభతో పులకరించింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడగా పల్లె, పట్నం హరివిల్లులా మారింది. సద్దుల బతుకమ్మ సంబరాలు గురువారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. మహిళలు, యువతులు పెద్దఎత్తున పాల్గొని ఆటపాలతో ఉత్సాహంగా గడిపారు.
అనంతరం వాయినాలు ఇచ్చి పుచ్చుకుని ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా.. అందరినీ చల్లంగా చూడు.. వచ్చే ఏడాది మళ్లీ రావమ్మ’ అంటూ మహిళలు బతుకమ్మకు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత బతుకమ్మలను చెరువులు, కుంటలు, కాల్వల్లో నిమజ్జనం చేశారు. పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.