బొడ్రాయిబజార్, డిసెంబర్ 12 : అధికారంలో ఉన్నా, లేకున్నా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కొంత సమయం ఇచ్చి ప్రజల నుంచి ఆ ప్రభుత్వంపై ప్రశ్నలు వచ్చే వరకు ఓపికతో ఉందామని సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హామీలన్నీ అమలు చేశామని, ఎన్నో మంచి పనులు చేశామని చెప్పారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెప్పేందుకు ఏమీ లేక పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందన్న వాదనను తీసుకొచ్చి తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇవ్వలేక తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు విద్యుత్ శాఖలో అప్పులు పేరుకుపోయాయని సాకు చూపెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో అసెంబ్లీలో తాను చర్చ పెట్టేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను గుర్తించి తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు.
హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటామని తెలిపారు. ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారని వారి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుదామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తేంత వరకు ఓపికతో ఉందామని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన నిలిచి పోరాడుదామని తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్కు పదేండ్లు అధికారం ఇస్తే ఎన్నో మంచి పనులు చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే దమ్ము ధైర్యం ఉండాలని కాంగ్రెస్ 90 రోజులు కాదు కదా 900 రోజులైనా నేరవేర్చదన్నారు. జోగులాంబ నుంచి అలంపూర్ వరకు బీఆర్ఎస్ అభ్యర్థులందరూ ఓటమి పాలైనా సూర్యాపేటలో తాను గెలిచి బొడ్రాయిలాగా నిలిచానని మళ్లా ఎన్నికల వరకు ఒక్కటి లేకుండా అన్ని మనమే గెలుస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని భరోసానిచ్చారు.
మంచి కోసం నిలబడి త్యాగాలకు సిద్ధపడిన చరిత్ర సూర్యాపేట ప్రజలదని అందుకు తన గెలుపే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో జరిగిన లోటుపాట్లను ఆలోచించి తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాను కేసీఆర్ తన ఆలోచనలతో దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కేసీఆర్‌కు ఉన్న విజన్, ఆలోచన ఇవాళ అధికారంలోకి వచ్చిన ఏ ఒక్కరికి లేదన్నారు. కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని.. తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. రుణమాఫీ చేస్తామని చేయలేదని, రైతుల ధాన్యాన్ని క్వింటాకు బోనస్ చెల్లించి రూ.4,500కు కొనుగోలు చేస్తామని నేటి వరకు ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వలేక సాకులు చెప్పి తప్పించుకునేందుకు విద్యుత్ శాఖలో అప్పులు చేశారని సాకు చూపెడుతుందని చెపపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తనను అడిగితే సమాధానం చెప్పేవాడినన్నారు. నాడు 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే నేడు 18 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, నాడు జెన్కో ఆస్తులు రూ.18 వేల కోట్లు అయితే నేడు రూ.50 వేల కోట్లకు వచ్చాయని, నాడు ఇచ్చింది 6 గంటల కరెంట్ అయితే తాము ఇచ్చింది 24 గంటల కరెంట్ అని తెలిపారు. అసెంబ్లీలో వాళ్లు చర్చ పెట్టడం కాదు తానే చర్చ పెట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నారు. ఉద్యమం నడిపినవారమంతా అసెంబ్లీలో ఉన్నామని మాట్లాడుతామన్నారు. అధికారం ఎక్కువ రోజులు ఏం ఉండదని అవకాశాలు వాళ్లే ఇస్తారని మనం సిద్ధంగా ఉండాలన్నారు. అధికారం మారింది కాబట్టి చిల్లర వేశాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఉంటాయని తెలిపారు.
కేసీఆర్ కొట్లాటలు, గొడవలు ఉండొద్దని అవి అభివృద్ధికి ఆటంకమని పదేండ్లుగా ప్రశాంతంగా ఉంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనలాగా చేయడం ఎవరితోను కాదని అది అందరికీ తెలుసన్నారు. ఎన్నికల ముందు తాను చెప్పినట్లుగానే వృద్ధ సింహం గాండ్రిస్తున్నదని అసెంబ్లీకి పోకున్నా అన్ని చేస్తామంటున్నాడు. ఎలా చేస్తాడు? ఏం చేస్తాడని ప్రశ్నించారు. సూర్యాపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఆలోచనతో డివైడర్‌ను కట్టించామని ఇప్పుడు ఆ డివైడర్‌ను తొలగించి రోడ్డు ప్రమాదాలకు కారకులు కాబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర చేష్టలతో ప్రజలను మెప్పించలేరన్నారు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలతో ఇక్కడ తాను గెలిచిన కాబట్టి నాకు ఓటు వేయని వాళ్లు కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నట్లు చెప్పారు. అధికారంలో ఉన్నవారి వైపు అధికారులు ఉంటారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వారంలో స్పష్టత వస్తుందని దానిపై తిరిగి ఆలోచన చేద్దామని, పార్టీ ఏ పిలుపు ఇచ్చినా వెంటనే స్పందించడమే మన ప్రధాన బాధ్యతన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల తరుపున పోరాడడమే మన ప్రధాన కర్తవ్యమని దాన్ని నాయకులు, కార్యకర్తలు దృష్టిలో ఉంచుకుని చైతన్యవంతులై పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిందని నాయకులు, కార్యకర్తలు ఎలాంటి కలత చెందవద్దని త్వరలోనే ప్రజల్లోకి వస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.