సూర్యాపేట, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న మన సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ విషం గక్కుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఇష్టపడే బతుకమ్మ పాటలు అంటేనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒంట్లో వణుకు పుడుతుందన్నారు.
అందుకే రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా సౌండ్ సిస్టమ్ లేకుండా మహిళలు ఉత్సాహంగా పండుగ చేసుకోకుండా చేశాడని విమర్శించారు. బతుకమ్మ పాట అంటే ముఖ్యమంత్రికి ఎందుకు భయమని, రాష్ట్రంలో ఏం జరుగుతున్నదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం లేదు అనడం కాదని, ఎప్పుడు ఎట్లా రావాలో కేసీఆర్‌కు తెలుసని పేర్కొన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఒకటే పూట బీఆర్ఎస్ నాయకులు వస్తే రెండో పూటకు రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, యూట్యూబ్, సోషల్‌మీడియాపై దాడులు చేస్తున్నారని, కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు.
హైడ్రా పేరుతో రూ.లక్షన్నర కోట్లతో మూసీ ఆధునీకరణతో ఇండ్లు కూలగొడుతుంటే దానిపై అనేక పాటలు వచ్చాయని, అవి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తాయోనని, వాటిని ఆపేందుకు మహిళలను నిరాశపర్చాడని విమర్శించారు. నిజాం రాజులు, నియంతలను ఎదిరించిన పాటలు బతుకమ్మ నుంచే వచ్చాయని, వాటిని ఆపాలనుకోవడం అవివేకమని, పోలీసులతో ప్రజల నోర్లు మూయించాలనుకుంటే పిచ్చితనమే అవుతుందని మండిపడ్డారు.
ఒక పాట బయటకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వ ప్రవర్తన, పరిపాలన విధానం మార్చుకొని చెంపలు వేసుకుంటే సాధ్యమవుతుంది తప్ప, ఈ రకంగా ప్రజల నోర్లు మూయించలేరన్నారు. పరిపాలన గొప్పతనం పాటల రూపంలో వస్తుంటే భయమెందుకు రేవంత్‌రెడ్డి అని అన్నారు. బతుకమ్మ పండుగ కల తప్పిందని మళ్లీ మన కేసీఆర్ రావాలని మహిళలు అంటున్నారంటే కేసీఆర్ పరిపాలన దక్షతకు ఆ మాట నిదర్శనమని, ఎన్ని పథకాలు పెట్టినా రేవంత్‌రెడ్డి అలాంటి మాట అనిపించుకోలేవని చెప్పారు. దాడు లు, కేసులు, నిషేధాలతో ప్రజలను, బతుకమ్మ పా టలను ఆపలేవన్నారు.
రేవంత్‌ది అట్ల తద్ది సంస్కృ తి అని, బతుకమ్మ బాధ, భావన తెలియదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పెద్దలను చూసి నేర్చుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయన, మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్కే తాహేర్‌పాషా, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం ఉన్నారు.