సూర్యాపేట అర్బన్, ఆగస్టు 22 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని, అప్పటివరకూ వదలిపెట్టేది లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తామన్న 49 వేల కోట్ల రుణమాఫీని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయకుండానే చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆడంబరాలు చేస్తున్నదని, దేవుళ్ల మీద ఒట్టుపెట్టి రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. ఆ హమీని గుర్తు చేసేందుకే రైతుల పక్షాన బీఆర్ఎస్ ధర్నాకు దిగిందని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయలేకనే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నదన్నారు.
ప్రజలను బహిరంగంగా మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ సర్కారు తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఎన్ని దాడులు చేసినా రైతు పక్షపాతిగా అన్నదాతకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రుణమాఫీ ఎంత చేశారో చెప్పడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
మొదట రూ.49వేల కోట్లు అని, అనంతరం 41వేల కోట్లని చెప్పి 36కు తెచ్చారని, ఆపై 31వేలు కోట్లంటూ నిర్ణయించామన్నారని విమర్శించారు. వారి లెక్కలు వేలం పాట లెక్క నే ఉందని ఎద్దేవా చేశారు. దేవుళ్ల మీద ఒట్టువేసి దేవుళ్లను సైతం మోసం చేసిన నాయకుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హమీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ను నిద్రపోనిచ్చేది లేదన్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్, రైతు సంఘాల నాయకులు గండూరి ప్రకాశ్, ఉప్పల ఆనంద్, పుట్ట కిశోర్, కక్కిరేణి నాగయ్యగౌడ్, సవరాల సత్యనారాయణ, బూరబాల సైదులు, నెమ్మాది భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్, తూడి నర్పింహా రావు, తాహెర్ పాష, కరుణ శ్రీ, జూలకంటి జీవన్ రెడ్డి, మహేశ్వరి, మామిడి అంజయ్య, బిట్టు నాగేశ్వర్రావు, వంగాల అంజయ్య పాల్గొన్నారు.