సూర్యాపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మోసం అన్నది కాంగ్రెస్ పార్టీ నైజమని, అది ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే ఆరు గ్యారెంటీలు, 420 హామీల వంటి మాయలు, మోసాలతోనని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆ హామీలు అమలు అయ్యేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడడం మన బాధ్యత అని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ.. ప్రజలతో మమేకమై ప్రభుత్వం మీద కొట్లాడి హామీలను అమలు చేయించేందుకు సూర్యాపేటలో నియోజకవర్గ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. రెండు రోజు శనివారం పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల ముఖ్య నేతలతో జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ప్రజలు తమకు అదనంగా ఇంకేదో వస్తుందని అనుకుని ఓట్లేసిండ్రని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెల నుంచే తాము మోసపోయామన్న భావన ప్రజల్లో మొదలైందన్నారు. కేసీఆర్‌ను తామే దూరం చేసుకున్నామని బాధ పడుతున్నారని పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారుపేరు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని ప్రజల్లో మరింత దృఢనమ్మకం ఏర్పడిందన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడి హామీలను అమలు చేయించాల్సిన గురుతర బాధ్యత మన భుజస్కందాలపై ఉందన్నారు.
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, బలగం అంటూ ఎవరెన్ని కుట్రలు చేసినా ఐక్యత కోల్పోవద్దని కోరారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ కొత్తగా ఇచ్చిన హామీలను మాట దేవుడెరుగు.. కేసీఆర్ ఇచ్చినవి కొనసాగించినా చాలని ప్రజలు అనుకుంటున్నారన్నారు. కేసీఆర్ అభివృద్ధి, నిర్మాణాలు చేపడితే.. రేవంత్ కూల్చివేతలతో అరాచకాలు చేస్తున్నాడని విమర్శించారు. 420 హామీలు ఎప్పుడు నెరవేరుస్తుందో కాంగ్రెస్ పార్టీకైనా క్లారిటీ ఉందా? అని ప్రశ్నించారు.
అభివృద్ధి మరచి హైడ్రాతో తప్పదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వాలపై విశ్వాసం పెంచుకునే పని మాని ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్‌కు ఉన్న సోయి కాంగ్రెసోళ్లకు ఉంటదా అని ప్రశ్నించారు. పోరాడి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ఆ దిశగా ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు.