సూర్యాపేట, మే 30 (నమస్తే తెలంగాణ) : చంద్రబాబు అంటేనే అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం మరోసారి రుజువు అయిందని.. మహానాడులో హైదరాబాద్ అభివృద్ధ్ది తనతోనే జరిగిందని బాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన జగదీశ్ రెడ్డి వీడియో విడుదల చేశారు. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందని అలాంటిది మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకన్నారు.
2014 నుంచి ఆంధ్రాలో మీ ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధ్ది ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 26వేల లోపే ఉన్నదని అలాంటిది కేసీఆర్ పాలనలో అన్నిరంగాలు అభివృద్ధిలో దూసుకుపోయి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాడు తెలంగాణలో 1.12 లక్షల తలసరి ఆదాయముంటే కేసీఆర్ పాలనలో 3.70 లక్షలకు చేరిందన్నారు. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరుగుతలేదో చెప్పాలన్నారు.