సూర్యాపేట, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ప్రజలకైనా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకైనా పార్టీనే భరోసా అని, కేసీఆరే ముఖ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. వ్యక్తులు వచ్చి పోతుంటారని, ఉద్యమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీకి ఏమీ కాదని స్పష్టం చేశారు. సోమవారం హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి దాదాపు వందలాది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో హైదరాబాద్‌కు వెళ్లి జగదీశ్‌రెడ్డిని కలిశారు.
పెద్దఎత్తున కేడర్ రావడంతో హుటాహుటిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. అందుబాటులో ఉన్న బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, మల్లయ్యయాదవ్, ఒంటెద్దు నర్సింహారెడ్డి, చెరుకు సుధాకర్‌ను పిలిచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేడర్‌కు ప్రతి క్షణం తాను అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి త్వరలోనే నియోకవర్గ సమన్వయ కమిటీలు వేస్తామని చెప్పారు.
పార్టీ కేడర్ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. గతంలో కంటే ఉత్సాహంగా పని చేయాలని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌కు వెళ్లిన నాయకుల్లో పలువురు మాట్లాడుతూ తమకు స్వేచ్ఛ లభించిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామని ఉత్సాహంగా మాట్లాడారు.