సూర్యాపేట టౌన్, డిసెంబర్ 4 : సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం నియోజక వర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
బొడ్రాయిబజార్ : సూర్యాపేట ఎమ్మెల్యేగా మరోమారు విజయం సాధించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు తన నామినేషన్ పత్రాలు వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన గెలిచిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకొని అర్చకుల ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు జగదీశ్‌రెడ్డికి స్వాగతం పలికి అర్చనలు నిర్వహించారు. వేద ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, శ్రీహరి ఆచార్యులు, సంకర్షణాచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు, ఆలయ కార్య నిర్వహణాధికారి వై. శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నాగారం : సూర్యాపేట ఎమ్మెల్యేగా గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం నాగారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, అధికార ప్రతినిధి చిల్లర చంద్రమౌళి, నాయకులు రాంరెడ్డి, అంబయ్య, బాలమల్లు, ఆంజనేయులు, మురళి, సోమయ్య, అంజి, ఎల్లయ్య, సోమలింగం పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని సోలిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. జగదీశ్‌రెడ్డి విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.