‘ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను మార్చింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీ కొడుతూ వాటినే కొనసాగించేలా మ్యానిఫెస్టోను రూపొందించింది. కాంగ్రెస్ ప్రచారాల్లో ప్రజల నుంచి స్పందన కరువవడమే ఇందుకు కారణం. ఎన్నిసార్లు మ్యానిఫెస్టోలు మార్చినా కాంగ్రెస్ ఖతం అవడం ఖాయం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 21న సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని శుక్రవారం ఆయన సభ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తొలుత ఆరు గ్యారెంటీల పేరిట, ఇప్పుడు 42 పేజీలతో మ్యానిఫెస్టో తెచ్చిందని, అది ఫోర్ ట్వంటీ మ్యానిఫెస్టో అని ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలతో ఆ పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదని విమర్శించారు.
సూర్యాపేట, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : మ్యానిఫెస్టోను ఎన్నిసార్లు మార్చినా కాంగ్రెస్ ఖతమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురాలోచనతో కాంగ్రెస్ గతంలో ప్రకటించిన మ్యానిఫెస్టోను మార్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీకొడుతూ వాటినే కొనసాగించేలా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 21న సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో సభా ఏర్పాటు స్థలాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రచారాల్లో ప్రజల నుంచి స్పందన కరువవడంతో తరచూ మ్యానిఫెస్టోను మార్చుతున్నారన్నారు. ప్రజలు ఏమాత్రం నమ్మని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మ్యానిఫెస్టోలు మార్చినా ఖతం కావడం ఖాయమన్నారు.
కాంగ్రెస్‌కు కంచుకోట అని చెప్పుకునే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కంచు అనేది మంచులా కరిగిపోయిన విషయాన్ని గమనించాలన్నారు. 2018తో పాటు తదనంతరం జరిగిన ప్రతి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తూ 12కు 12 స్థానాలు కైవసం చేసుకుందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో సైతం అన్ని సీట్లను బీఆర్ఎస్కు కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరిట ఆరు అబద్దపు హామీలను తీసుకురాగా తాజాగా 42 పేజీలతో మ్యానిఫెస్టో అంటూ తెచ్చింది అది కేవలం 420 మ్యానిఫెస్టో అని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు హామీలు ఇస్తున్నారే తప్పా వాటి అమలు ఎలా సాధ్యమో ప్రశ్నిస్తే సమాధానమే లేదన్నారు. తెలంగాణ అమరుల త్యాగాలను, పోరాటాన్ని తక్కువ చేసిన కాంగ్రెస్ పార్టీని వంద అడుగుల గుంత తీసి బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి వృద్ధ నాయకులను ప్రజలు ఘోరంగా ఓడించబోతున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ సభలకు వస్తున్న జనమే బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి సంకేతం అన్నారు. రేవంత్‌రెడ్డి నోటితో రైతులకు మూడు గంటల విద్యుత్ చాలంటాడు.. మ్యానిఫెస్టోలో 24 గంటలు అంటారు. అసలు ప్రజలు ఏదీ నమ్మాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి అతిపెద్ద క్యాంపెయినర్ అని కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీని గెలిపించడమే తన ఎజెండాగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాహుల్ గుజరాత్లో ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మినందుకు కర్ణాటకలో రైతులు గోస పడుతున్నారని.. తెలంగాణ ప్రజలు మోసపోతే చీకట్లు అలుముకుంటాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి వెంకటేశ్వర్రావు, గండూరి ప్రకాశ్, డాక్టర్ రామూర్తియాదవ్, చివ్వెంల జడ్పీటీసీ సంజీవ్‌నాయక్, మద్ది శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.