సూర్యాపేట, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోరబండ డివిజన్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ సార్‌ను గెలిపించుకోలేకపోయామన్న తపన ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నది. ఈ విషయంలో హైదరాబాద్ వాళ్లమంతా క్లారిటీగా ఉన్నాం. కొన్ని ఊర్లలో నష్ట జరిగింది’ అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ‘ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదాలు వేసుడు తప్ప చేసే అభివృద్ధి ఏమీ లేదు. కేసీఆర్ ఇచ్చినవే సక్కగా ఇస్తలేరు. కొత్తగా ఏం చేస్తారు’ అని అంటున్నారని చెప్పారు. ప్రజలు ఉత్తగా చెప్పడం లేదని, కారణాలు కూడా చెబుతున్నారని అన్నారు.
‘కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉంది. బిల్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు కరెంట్ సక్కగా వస్తలేరు. బిల్లులు మాత్రం ఎక్కువ వస్తున్నది. గతంలో రూ.560 వచ్చిన బిల్లు ఇప్పుడు రూ.2,600 ఎందుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు’ అని తెలిపారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడు ఉచితంగా వచ్చిన నల్లా బిల్లు ఇప్పుడు రూ.30 వేలు వేస్తున్నారు. అటువంటి వాళ్లకు మేం ఎట్లా ఓట్లు వేస్తామంటున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కేసీఆర్ పెట్టినవే వస్తున్నాయి. కాంగ్రెస్ అదనంగా ఇస్తామన్న బంగారం ఏదంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏం చేసిందో ఒక్కటైనా చెప్పాలని అడుగుతున్నారు’ అని తెలిపారు. ఎమ్మెల్యే, మంత్రి ఎవరొచ్చినా ఇదే అడుగుతామని ధైర్యంగా చెబుతున్నారని తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ మంత్రులు, పోలీసులు గూండాయిజాన్నే నమ్ముకున్నారని, రౌడీలు, గూండాల అంతు ప్రజలెప్పుడో చూసిండ్రని అన్నారు. మనం డెమోక్రసీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దని, ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే ఆ ఉప్పెనను తట్టుకోలేరన్నారు. రౌడీయిజాలను, బెదిరింపులను ప్రజలెప్పుడు లెక్క పెట్టరని, దేశాధ్యక్షులనే వెంటపడి తరిమిన ఘటనలు చూస్తున్నామని, కాంగ్రెస్‌కు కూడా రేపు అదే పరిస్థితి వస్తదని అన్నారు. ‘చాయ్ కొట్టు, కిల్లీకొట్టోలని భయపెట్టే వాళ్లని నాయకులంటారా? ఇటువంటి వాళ్లను రానిస్తే జూబ్లీహిల్స్‌కు శని పట్టుకుంటదని ప్రజలు పేర్కొంటున్నారు. అది నిజమేనని కాంగ్రెస్ వాళ్లు కూడా మాట్లాడుకుంటున్నారు’ అని చెప్పారు.