నకిరేకల్, ఫిబ్రవరి 26 : తాను అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ చేశారు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్‌లో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పందిస్తూ ఆదివారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థికంగా ఎదుగుతున్న దళిత సమాజంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అలజడులు సృష్టిస్తున్నాడన్నారు.
స్వలాభం కోసమే ప్రవీణ్‌కుమార్ దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మహనీయులు బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను అనుభవిస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకున్న చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్కుమార్దని దూషించారు. ప్రభుత్వ ఉద్యోగి పేరుతో అక్రమంగా వేల కోట్లు సంపాదించిన చరిత్ర ఆయనదన్నారు. రాజకీయ మనుగడ కోసమే దళిత యువకులను రెచ్చగొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యావంతుడు, సీనియర్ అధికారి అయి ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రూ.3500 కోట్లు అక్రమంగా సంపాదించారని నిరాధార వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, అక్రమ సంపాదనపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సీబీఐ, ఏసీబీ అధికారులతో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. రూ.3500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు నిందలు వేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.