గుండాల, డిసెంబర్ 20 : నిండు అసెంబ్లీలో శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అబద్ధాలు పలికారు. నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా గత 10 ఏండ్ల కాలంలో చుక్క నీరు రాలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలకు దిగారు. గుండాల మండలాన్ని కరువు కోరల నుంచి కాపాడడానికి నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో పుష్కలమైన సాగునీరు అందించారు.
2017వ సంవత్సరం నవంబర్ 3న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కలిసి నవాబ్‌పేట రిజర్వాయర్ గేట్లను తెరిచి గుండాల మండలానికి సాగునీటిని విడుదల చేశారు. సాగునీరు విడుదలతో మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు నిండి అలుగు పోశాయి. కరువుతో కొట్టుమిట్టాడుతున్న గుండాల మండలానికి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీరు అందించడంతో రైతుల కళ్లల్లో వెలుగులు నిండాయి. ఆ తర్వాత సైతం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి పలు దఫాలుగా సాగునీరు అందించి మండలంలోని సుమారు 87 చెరువులు, కుంటలు నింపారు.
నాడు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్ని చెరువుల వద్ద గోదావరి జలాలకు ఇరిగేషన్ అధికారులతో కలిసి పూజలు చేశారు. గత ప్రభుత్వంలో పలుమార్లు సాగునీరును విడుదల చేసి చెరువులు నింపినప్పటికీ… శుక్రవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి చుక్క నీరు రాలేదనడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సాగు నీరు విడుదల చేసినా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో బీఆర్ఎస్, గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై నిందలు వేయాలనే ఉద్దేశ్యపూర్వకంగా బీర్ల అయిలయ్య నిండు అసెంబ్లీలో అసత్యాలు మాట్లాడారని, సత్యాలను అసత్యాలుగా సృష్టిస్తే ప్రజలు నమ్మరని గుండాల మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా సాగు జలాలు పుష్కలంగా రావడంతో 87 చెరువులు మత్తడి దుంకి అలుగు పోశాయి. ఒకప్పుడు కరువుతో అల్లాడిన గుండాల మండలానికి గోదావరి జలాలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
గతంలో కరువు కోరల నడుమ రైతులు వ్యవసాయం చేయలేక వలసలు వెళ్లిపోయే పరిస్థితుల్లో గుండాల మండల వ్యాప్తంగా 10 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా జలాలు అందించిన తర్వాత సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాగు జలాలు విడుదల తర్వాత 25 వేల నుంచి 32 వేల ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చింది.