మిర్యాలగూడ, జనవరి 12: నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పై సీఈ, ఎస్సీ, ఈఈ, డీఈ, ఏఈతోపాటు శుక్రవారం ఆయన పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో, పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని దానిని వెంటనే పరిష్కరించాలన్నారు.
నియోజకవర్గంలో ఎక్కడైనా సమస్య ఏర్పడితే తన దృష్టికి తీసుకొచ్చి సంబంధిత ఉద్యోగి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సీజన్లో వానలు సరిగా లేకపోవడం వల్ల నాగార్జునసాగర్ జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున చాలా మంది రైతులు బోర్లు వేసుకోని వ్యవసాయం చేస్తున్నారని, రానున్న వేసవిలో భూగర్భజలాలు తగ్గి తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉన్నందున అధికారులు ఇప్పటి నుంచే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ సీఈ మధుబాబు, ఎస్సీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్రావు, డీఈ సాయిలక్ష్మి ఏఈలు పాల్గొన్నారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంప్ రిజిస్టర్ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిను కలిసి నోట్ పుస్తకాలు అందించి గ్రౌండ్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రౌండ్లో తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పాదచారులకు ఇబ్బందులు లేకుండా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గ్రౌండ్ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అతీఫ్, మోసిన్అలీ, బంజారా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాలోతు దశరథనాయక్, కౌన్సిలర్ జాని ఉన్నారు.