ఆలేరు పట్టణంలోని మార్కండేయ కాలనీవాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కాలనీలో మట్టిరోడ్లపై నడవలేని దుస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులు లీక్ అయి తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. కాలనీలో సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. సమస్యలను పరిష్కరించాలని కౌన్సిల్ తీర్మానం చేసినా అధికారులు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపిస్తున్నారు.
ఆలేరు టౌన్, ఆగస్టు 31: ఆలేరు పట్టణంలోని 7వార్డు మార్కండేయ కాలనీలో సమస్యలు తిష్ట వేశాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజాప్రతినిధలకు, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోతోందని కాలనీవాసులు వాపోతున్నారు. చేనేత కళాకారుల కోసం 1996లో కాలనీ నిర్మాణం చేసి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. 2020లో మార్కండేయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌గా రిజిస్ట్రేషన్ చేయించారు.
కాలనీ నిర్మాణమై 30 సంవత్సరాలైనా ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించే వారే కరువయ్యారు. ఈ కాలనీలో రెక్కాడితేగాని డొక్కనిండని చేనేత కళాకారులు జీవనం కొనసాగిస్తున్నారు. కాలనీలో మట్టి రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీసీరోడ్లు నిర్మించడంలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదు. చిన్నపాటి వర్షానికి కాలనీ రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు బురద రోడ్లపై నడుస్తూ నరకయాతన పడుతున్నారు. బురదదారుల్లో వాహనాలను నడపలేని దుస్థితి నెలకొంటోందని స్థానికులు వాపోతున్నారు.
పాముల బెడద
కాలనీలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ గుంతల ఏర్పడ్డాయి. రోడ్లపై గుంతల్లో వర్షపు నీరు చేరి చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. రోడ్లపై గుంతల్లో వర్షపు నీటిలో ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పాములు, తేళ్లు, క్రిమికీటకాలు సంచరించడంతో భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సమీపంలోని చంద్రమౌళి ఇంటిలో రాత్రిపూట అతని కుమారుడిని పాము కాటు వేయడంతో మృతి చెందాడు.
సొంత నిధులతో డ్రైనేజీ నిర్మాణం
గత ప్రభుత్వ హయాంలో కాలనీ మధ్యలో కాంట్రాక్టర్ అండర్ డ్రైనేజీని సక్రమంగా నిర్మించలేదు. అండర్ డ్రైనేజీ పైనుంచి ట్రాక్టర్లు, భారీ వాహనాలు నిర్మించిన కొన్ని రోజులకే పైపులు పగిలి పోయాయి. అండర్ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం పాడైంది. కాలనీవాసులు ఇండ్ల వద్ద అండర్ డ్రైనేజీ వరకు సొంత నిధులతో ప్లాస్టిక్ పైపులు వేసుకొని నిర్మించుకున్నారు.
మిషన్ భగీరథ నీళ్లే ఆధారం
కాలనీవాసులకు మిషన్ భగీరథ నీళ్లే జీవనాధారంగా మారాయి. అప్పుడప్పుడు మిషన్ భగీరథ పైపులు పగలడంతో నాలుగైదు రోజులు కాలనీవాసులు నీళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరూ రోజు విడిచి రోజు, ఒక్కోసారి రెండుమూడు రోజులకు రావడంతో అవస్థలు పడుతున్నారు. కాలనీలో వాటర్ పైపులైన్ సరిగ్గా లేక నీళ్లు రావడం లేదని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలనీలో వాటర్ ట్యాంక్ అవసరముందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మార్కండేయ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఓట్ల కోసమే వస్తారు
కాలనీలో డ్రైనేజీ , సీసీరోడ్లు లేక చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాం. నాయకులు ఎన్నికల సమయంలో కాలనీని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత కాలనీని పూర్తిగా మర్చిపోతున్నారు. ఎక్కడైనా మిషన్ భగీరథ పైపులు పగిలితే నాలుగైదు రోజుల వరకు నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నాం. కాలనీలో పద్మశాలీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వినతి.
-చిట్టిమెల్ల కృష్ణ, చేనేత కళాకారుడు
ప్రభుత్వం మారడంతో సమస్యలు
ఆలేరు పట్టణంలోని ఏడోవార్డు కౌన్సిలర్‌గా గెలిచిన అనంతరం సిల్క్‌నగర్, మార్కండేయ కాలనీల్లోని ప్రతి వీధిలో మట్టిపోశాం. మిషన్ భగీరథ పైపులు వేసి ప్రతి ఇంటికి తాగునీటిని అందించాం. కాలనీ మధ్యలో అండర్ డ్రైనేజీ నిర్మించాం. మార్కండేయ కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.2 కోట్లు, మంతపురి రోడ్డులోని ైప్లెఓవర్ నుంచి రత్నాల వాగు వరకు రూ.98 లక్షలతో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం చేసింది. ప్రభుత్వం మారడంతో ఆలేరులో అభివృద్ధి కుంటుపడుతోంది.
-మొరిగాడి మాధవి వెంకటేశ్వర్లు, మాజీ వైస్ చైర్పర్సన్
కౌన్సిల్ తీర్మానం చేసింది
కాలనీ అభివృద్ధి కోసం కౌన్సిల్ తీర్మానం చేసింది. ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధు లు ఉన్నాయి. త్వరలో కాలనీలో సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. మంతపురి రోడ్డులో ైప్లెఓవర్ నుంచి రోడ్డుకు ఇరువైపులా రత్నాల వాగు వరకు ఓపెన్ డ్రైనేజీని నిర్మిస్తాం.
-శ్రీనివాస్, కమిషనర్