విల్లులా వంగిన కాళ్లు.. వంకర్లు తిరిగిన చేతులు.. నేలను తప్ప ఆకాశాన్ని ఎరుగని కండ్లు.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పాపానికి దశాబ్దాల తరబడి నల్లగొండ జిల్లా బిడ్డలు అనుభవించిన నరకమిది. తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరక్క ఫ్లోరైడ్ నీటినే ఆశ్రయించి నానాటికీ జీవచ్ఛవాలుగా మారిన దుస్థితి. ఇతర ప్రాంతాల్లోనూ ఎండకాలం వచ్చిందంటే కిలోమీటర్లు నడిచి వ్యవసాయ బావులు, ఏరుల వద్దకు క్యాన్లు, బిందెల్లో నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి. ఎటుచూసినా ఎండిన బోర్లు, బావులు, శిథిలావస్థలో ఉన్న ట్యాంకులే కనిపించేవి.
సూర్యాపేట పట్టణ ప్రజలకైతే మూసీ మురుగు నీళ్లే దిక్కయ్యేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన నాటి దుర్భర పరిస్థితులకు చరమ గీతం పాడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా నేడు ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందుతున్నది. మారుమూల గ్రామాలు, ఆవాసాలకు సైతం నీటి అవస్థలు తీరాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఆలస్యం.. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేటకు సాగర్ కాల్వ ద్వారా కృష్ణా నీటిని తీసుకొచ్చి తాగునీటి గోసను తీర్చారు. అనంతరం మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం మంచి నీళ్ల పండుగను నిర్వహించనున్నారు. సూర్యాపేట మండలం ఇమామ్‌పేట వద్దనున్న మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద 5వేల మందితో సభను ఏర్పాటుచేస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
సమైక్య రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడేది. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. నల్లగొండ జిల్లాలో తాగునీటిలో ఫ్లోరిన్తో ప్రజలు అనారోగ్యం పాలైన దుస్థితి. కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేసిన మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన కృష్ణా జలాలు అందుతున్నాయి. దీంతో పాటు ఫ్లోరైడ్ సమస్య కూడా కనుమరుగైంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1718 ఆవాసాల్లో 4.18 లక్షల నల్లాల ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల వారికి 135 లీటర్ల శుద్ధి చేసిన నీరు అందుతోంది.
ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు
1998లో సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ అక్కడి ప్రజల తాగునీటి కష్టాలు చూసి చలించి పోయిన ఆయన ఆ నాడే నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికీ తాగునీటిని అందించారు. 2003లో ఉద్యమ నాయకుడిగా మునుగోడులో పర్యటించిన ఆయన రాష్ట్రం ఏర్పాటు కాగానే మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ పథకాన్ని ప్రారంభించి 2018 నవంబర్ నాటికి జిల్లాలో ఈ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.
రూ.2938 కోట్లతో మిషన్ భగీరథ
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరు ఇవ్వాలంటే కృష్ణాజలాలే ఆధారమని భావించిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన నీటినే వినియోగించి ప్రజలకు తాగునీటిని ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు రూ.2938.33 కోట్లు ఖర్చు చేసింది. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు టెయి లాండ్, పానగల్ ఉదయ సముద్రం ద్వారా నీరు తరలించి ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసి ఇంటింటికీ సరఫరాఆ చేస్తున్నారు. గ్రిడ్ల నుంచి ఎత్తి పోసే నిర్మాణాలకు రూ.2345 కోట్లు, పైప్లైన్లు, ట్యాంకుల కోసం రూ.593.35 కోట్లు ఖర్చు చేసింది.
4.14 లక్షల నల్లాల ద్వారా నీటి సరఫరా
నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇవ్వడానికి రూ.2938 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1718 ఆవాసాలు, ఎనిమిది మున్సిపాలిటీలకు తాగు నీటినీ అందిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోనే 2018 తర్వాత 4,14,738 ఇండ్లల్లో నల్లాలు బిగించి 100 లీటర్లు సరఫరా చేస్తుండగా పట్టణాల్లో మున్సిపల్ యంత్రాంగం ద్వారా రెగ్యులర్‌గా 135 లీటర్ల తాగు నీరు అందుతోంది. 2014కు ముందు జిల్లాలో 40 ఎల్పీసీడీ ట్యాంకులతో 130 గ్రామాలకు తాగు నీరు ఇవ్వగా.. నేడు 100 ఎల్పీసీడీతో వాటి సామర్థ్యాన్ని పెంచి 1718 ఆవాసాలకు ఇస్తున్నారు. జిల్లాలో నాడు 150 ఎంఎల్డీ శుద్ది కేంద్రాలు ఉండగా నేడు 245 అయ్యాయి. గ్రిడ్ పైప్‌లైన్ 179 కి.మీ. నుంచి 3836 కి.మీ పెరగ్గా, 120 ట్యాంకులను అనుసంధానం చేసి సంపులు 68 నుంచి 98కి, తాగునీటి చెరువులు 975 నుంచి 1571కి పెరుగడంతో నాడు 27,412 ఇండ్లకే తాగు నీరు అందగా నేడు 4,18,738 ఇండ్లకు అందుతోంది.
మునుగోడు గోస తీర్చిన సీఎం కేసీఆర్
జిల్లాలో తాగునీటిలో అత్యధిక ఫ్లోరిన్ ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తుండడంతో ప్రస్తుతం అక్కడ ఫ్లోరోసిస్ మహమ్మారి ఆనవాళ్లు లేకుండా పోయాయి. 1945లోనే ఈ ప్రాంతంలో తాగునీటిలో ఫ్లోరిన్‌ను గుర్తించగా అప్పటి పాలకులు పట్టించుకోక పోవడంతో నియోజకవర్గ ప్రజలు అనేక మంది ఫ్లోరోసిస్ బారిన పడి 30 ఏండ్లకే ముసలివాళ్లుగా, వికలాంగులుగా మారారు. నియోజకవర్గంలో 53శాతం మంది ఫ్లోరోసిస్ బారిన పడినట్లు అప్పట్లోనే గుర్తించారు. అప్పట్లో ఈ ప్రాంతంలోని నీటిలో 7 పీపీఎం ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన మూడేండ్లలోనే తొలిసారి మునుగోడుకు మిషన్‌భగీరథ నీటిని అందించారు. ఆ తర్వాత 2019లో నేషనల్ హెల్త్ మిషన్ స్కీం కింద జిల్లా ఆరోగ్యశాఖ యంత్రాంగం పాఠశాల విద్యార్థులను పరీక్షించగా ఫ్లోరిన్ మొత్తమే లేదని తేలింది.
నీటి తగాదాలు లేవు
2014కు ముందు జిల్లాలో వేసవి వచ్చిందంటే గ్రామాల్లో నీటి తగాదాలు షరా మామూలేగా ఉండేది. భూగర్భ జలాలు అడుగంటి ఎక్కడ బోరు వేసినా చుక్క నీరు పడని పరిస్థితి. అయితే 2018 తర్వాత మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించడం వల్ల తాగునీటి ఇబ్బందులు తీరాయి. ప్రతిరోజూ తమ ఇంటికీ శుద్ధి చేసిన నీరు అందుతుండడంతో ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు.
నేడు మంచినీళ్ల పండుగ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో మంచి నీళ్ల పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించనున్నారు. నీటిని సరాఫరా చేసే వాటర్ మ్యాన్లకు సన్మానించనున్నారు. దాంతో పాటు నల్లగొండలోని పానగల్, మిర్యాలగూడలోని అవంతీపురం, దేవరకొండలోని కోదండాపురం, మునుగోడులోని బాట్లపల్లి ట్రీట్ మెంట్ వాటర్ ప్లాంట్ల వద్ద వెయ్యి మందితో సభ నిర్వహించి ఆ ప్లాంట్ పరిధిలో పని చేసే కార్మికులను సన్మానించనున్నారు.