సూర్యాపేట, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : గతంలో 33 మాడ్యూల్స్‌తో ఉన్న ధరణికి ప్రత్యామ్నాయంగా, ఆరు మాడ్యూల్స్‌తో భూభారతిని తెచ్చినా అందులో మళ్లీ 33ఆప్షన్లు కనిపిస్తున్నాయి. గతంలో భూ వివాదాలు, సమస్యలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లేవారు కాగా భూభారతితో ఆర్డీఓ, జేసీ, కలెక్టర్లకు అప్పిలేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ధరణి, భూ భారతికి ఎలాంటి తేడాలేదని స్పష్టమవుతున్నది.
ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మండలాలతో పాటు తొలిరోజు రెవెన్యూ సదస్సులో దాదాపు 70 శాతం వరకు మిస్సింగ్, పెండింగ్ మ్యుటేషన్లు వచ్చాయి. పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో మిస్సింగ్ సర్వే నెంబర్లు, పెండింగ్ మ్యుటేషన్ల సమస్య పరిష్కరించేందుకు ఆయా సర్వే నెంబర్లలో ఉన్న రైతులు సహకరించడంలేదు.
బీఆర్ఎస్ హయాంలో భూసమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ తీసుకువచ్చింది. దాదాపు 98శాతం రైతుల రికార్డులు ఆన్లైన్ చేయడంతో పాటు పక్కా పాస్‌పుస్తకాలు వచ్చాయి. మిగిలిన రెండు శాతం మాత్రం కోర్టు కేసులు, వ్యక్తిగత పంచాయితీలు తదితర కారణాలతో నిలిచిపోయాయి. వాటిని కూడా పరిష్కరించాల్సి ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ధరణి స్థానంలో పేరు మార్చి భూభారతిని తీసుకువచ్చింది.
ఇప్పటి వరకు ఉన్న ధరణి స్థానంలో వచ్చిన భూభారతితో రైతులకు అదనంగా ఒరిగేది శూన్యమని తెలుస్తున్నది. వందలాది సంవత్సరాల నుంచి ఉన్న రికార్డులతో పాటు, ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల లీలలతో ఇష్టారాజ్యంగా రికార్డులు ఉండడంతో ధరణితో ఆన్లైన్ చేయడానికే అనేక సమస్యలు వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు మాడ్యూల్స్ తెచ్చారు. ప్రభుత్వం సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా తొలిరోజు అత్యధికంగా మిస్సింగ్ సర్వే నెంబర్లకు సంబంధించినవే 70శాతం వరకు ఉన్నాయి. మిగిలిన 30 శాతంలో పేరు మార్పిడీ, ఇనాం భూములకు పట్టాచేయాలని, సాదాబైనామాలు, లావుని పట్టాల మార్పిడీలపై దరఖాస్తులు వస్తున్నాయి. గత మే నెల 5న జిల్లాలోని గరిడేపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోగా మండల వ్యాప్తంగా 1,690 దరఖాస్తులు వస్తే కేవలం 65 మాత్రమే డిస్పోజ్ అయ్యాయి. మిగిలిన వాటిలో 912 దరఖాస్తులు మిస్సింగ్ సర్వే నెంబర్లు ఉండగా మిగిలినవి సాదాబైనామాలు, ప్రభుత్వ భూములు, లావని పట్టాలకు సంబంధించినవే. అలాగే ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏనుబాముల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సాదాబైనామాలకు సంబంధించి 95 దరఖాస్తులు రాగా మిస్సింగ్ సర్వే నెంబర్లు 10, మూడు వారసత్వ భూముల దరఖాస్తులు అందాయి.
మిస్సింగ్ సర్వే నెంబర్ల దరఖాస్తులు పరిష్కరించేందుకు ఆయా సర్వేనెంబర్లలో ఉన్న రైతుల నుంచి సహకారం అందడం లేదని, నోటీసులు ఇచ్చేందుకు వెళితే తీసుకోవడం లేదని రెవెన్యూ అధికారుల ద్వారా తెలిసింది. అలా కాకుండా పహాణీలు పరిశీలిద్దామనుకుంటే సరిగా లేకపోవడంతో అనేక చిక్కులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. రైతులు ఏండ్ల తరబడి తాము ఉన్న భూమి తమది కాదు… వేరే చోటకు వెళ్లాలని చెబుతారని రైతులు భయాందోళన చెందడం… కొన్ని సార్లు రైతుల మధ్య ఘర్షణలకు తావిస్తున్నది. దీంతో మిస్సింగ్ సర్వే నెంబర్ దరఖాస్తులకు ఆయా సర్వే నెంబర్లలో ఎక్స్టెంట్ లేక అధికారులు, ఉద్యోగులు ఏమి చేయోలా అర్థం కావడం లేదు. ఈ లెక్కన ధరణిని భూభారతిగా పేరు మార్చినా ఎలాంటి లాభం లేదని తెలుస్తున్నది. ధరణితో 98శాతం పూర్తి కాగా మిగిలిన రెండు శాతాన్ని కూడా ఏమైనా చేయవచ్చా అనేది ఆలోచన చేయకుండా ఏదో కొత్తగా సాధిస్తున్నట్లు పాత ఆప్షన్లతోటే భూభారతి తీసుకువచ్చారు.