సాధారణంగా ఏ మండలంలోనైనా అదృశ్యం కేసులు అరుదుగా నమోదవుతుంటాయి. నెలకు రెండు, మూడు కేసులకు మించి ఎఫ్ఐఆర్ రికార్డు అయ్యే పరిస్థితి ఉండదు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో మాత్రం మిస్సింగ్ కేసులకు అంతే లేకుండా పోతున్నది. ఇక్కడ ‘అదృశ్యం’ ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నది. అసలు ‘కనబడుటలేదు’ అనే కేసులు ఎందుకు అధికంగా నమోదు అవుతున్నాయి..? ఏదైనా మిస్సింగ్స్ మిస్టరీ ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ ఓ కీలకమైన మండలం. చౌటుప్పల్ పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మండలంలో సుమారు 80 వేల మంది వరకు జనాభా ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. మండల వ్యాప్తంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, కంపెనీలు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాల ఉద్యోగులు, కార్మికులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. చౌటుప్పల్ డివిజన్ కావడంతో ఆర్డీఓ కార్యాలయం, ఏసీపీ ఆఫీస్ కూడా ఉంది.
చౌటుప్పల్ పట్టణం, రూరల్‌లో కొంత కాలంగా మిస్సింగ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. టౌన్ లేదా రూరల్‌లో అదృశ్యం కేసులకు పుల్‌స్టాప్ పడటంలేదు. దీని పరిధిలో వారంలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజులపాటు నిత్యం ‘చౌటుప్పల్‌లో అదృశ్యం’ అనే వార్తలు న్యూస్ పేపర్లు, సోషల్ మీడియాలో నిరంతరాయంగా వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవి ఎఫ్ఐఆర్ నమోదైనవి మాత్రమే. కేసులు నమోదు కానివి మరికొన్ని సంఘటనలు ఉన్నట్లు తెలుస్తున్నది. కేసుల వివరాలు ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.
మిస్సింగ్ కేసుల్లో అధికంగా యువతులు, మహిళలే ఉన్నారు. అది కూడా 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వారే కనిపించకుండా పోతున్నారు. కొన్ని సందర్భాల్లో మైనర్లు సైతం అదృశ్యమవుతున్నారు. తక్కువ కేసుల్లో మాత్రమే పురుషులు ఉంటున్నారు. ప్రేమ, పెండ్లి వ్యవహారం, వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఇవే కారణాలా..? మరే ఇతర కోణం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా లవ్, వివాహేతర, కుటుంబ గొడవలు కేవలం ఇక్కడ మాత్రమే జరుగుతున్నాయా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
చౌటుప్పల్ పోలీసులకు మిస్సింగ్ కేసులు సవాలుగా మారుతున్నాయి. ఎఫ్ఐఆర్ల సంఖ్య పెరిగిపోతుండటం పోలీసులను టెన్షన్ పెడుతున్నది. కొన్ని కేసులు పరిష్కారమవుతున్నా.. మరికొన్ని తేలకుండానే మిగిలిపోతున్నాయి. దీంతో తమ వారు ఎక్కడున్నారో..? ఎలా ఉన్నారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఆరా తీస్తున్నారు. ఏవేవో కారణాలు చెబుతూ పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసులను తేలికగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మే 12 : చౌటుప్పల్ మండలంలోని పీపల్ పహాడ్‌కు చెందిన ఓ యువతి (21ఏండ్లు) డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నది. సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రి కుమార్తె లేకపోవడం గమనించాడు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు, బంధువులను ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 7 : మండలంలోని ఖైతాపురం గ్రామానికి చెందిన ఓ యువతి (24) బీటెక్ పూర్తి చేసి ఉంట్లోనే ఉంటున్నది. తల్లి మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.