నందికొండ, మే 12 : మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనే ఓసియన్ గ్రూప్ -4లోని 22 దేశాలకు చెందిన అందాలభామలు బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటుండగా, అందులోని ఆసియా దేశాలు ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేసియా, జపాన్, కజికిస్తాన్, కిర్గికిస్తాన్, లెబెనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియాకు చెందిన సుందరీమణులు బుద్ధవనానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి బస్సులో రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి సాయంత్రం 4.55 నిమిషాలకు నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని విజయవిహార్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్తూ వీరు చింతపల్లి మండల పరిధిలోని తీదేడు సమీపంలో గల వెల్లంకి గేస్ట్ హౌస్‌లో సుమారు గంట సేపు అగారు. వీరికి ఐజీ సత్యనారాయణ, ప్రత్యేకాధికారి లక్ష్మి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్ పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలతో స్వాగతం పలికారు.
విజయవిహార్ అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకొని విజయవిహార్ వెనుక భాగంలో కృష్ణానది అందాలతో ఫొటో షూట్ చేశారు. సుందరీమణులు సెల్ఫీలు తీసుకుంటూ అతిథి గృహం వద్ద సందడి చేశారు. అనంతరం విజయవిహార్ ముందుభాగంలో మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన స్టేజీపై గ్రూప్ ఫొటో దిగారు. అక్కడి నుంచి 6.15 నిమిషాలకు బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనం చేరుకొని బుద్ధచరిత వనంలోని బుద్ధడి పాదాలకు పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపం ఎదుట గ్రూప్ ఫొటోలను దిగారు. మహాస్థూపం నుంచి ధ్యాన మందిరానికి పోయే మార్గంలో లంబాడి సాంస్కృతిక డ్యాన్స్‌లతో స్వాగతం పలుకగా 7.40 నిమిషాలకు మహాస్థూపంలోని ధ్యాన మందిరానికి చేరుకున్నారు. మహాస్థూపంపై ఏర్పాటు చేసిన బుద్ధుడి శిల్పాలను, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలను బుద్ధవనం పూరావస్తు నిఫుణులు ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. ధ్యాన మందిరంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నా రు. అనంతరం జాతక పార్కులో బుద్ధ చరితంపై కళాకారుల నృత్య ప్రదర్శను తిలకించి రాత్రి 8.20 నిమిషాలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, శంకర్‌నాయక్, మిర్యాలగూడ్ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఏఎస్పీ మౌనిక, ఆర్డీఓలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.