నల్లగొండ, జూలై 2: ఎస్ఎల్బీసీ పనులను పున:ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు సైన్యంలో పనిచేసిన అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీతో పాటు జిల్లాలోని డిండి, హెచ్ఎల్సీ, నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్, బునాదిగాని కాల్వ, పిల్లాయి పల్లి, ధర్మారెడ్డి కాల్వ పనులకు స్థానిక ఎమ్మెల్యేల చొరవ తీసుకొని అధికారులను సమన్వయం చేసుకొని భూసేకరణ పనులు పూర్తి చేసే,్త పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు.
ఈనెల 13లోగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే 14న సీఎం చేతులమీదుగా తుంగతుర్తి నియోజక వర్గంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణ ప్రక్రియ చేపట్టామని దీనికి రూ.12వేల కోట్లు కేటాయించామని, ఇందులో కాంట్రాక్టర్ 40 శాతం, బ్యాంకు ద్వారా 60 శాతం రుణం తీసుకొని రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నా యక్, నెల్లింకంటి సత్యం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలూనాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, మందుల సామేల్, కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, అమిత్ నారాయ ణ, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితోపాటు పలువు రు ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.