నీలగిరి, మార్చి 8 : నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా డీఆర్సీ సమావేశంలో పలు సమస్యలను ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదుట ఏకరువు పెట్టారు. సమస్యల కారణంగా ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నామని, రైతులు, ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేక నిధుల కొరత కారణంగా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు నల్లా ట్యాప్‌లు సైతం పెట్టలేకపోతున్నారని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో తాగునీరు లేదని ఖాళీ బిందెలతో ప్రజలు, పంటలు ఎండుతున్నాయని రైతులు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో వారితో ఇప్పుడు పనులు ఎలా చేయించాలని ప్రశ్నించారు. అయితే.. సభలో ఏర్పాటు చేసిన మైకు పనిచేయకపోవడంతో ఎమ్మెల్యేలు మైకు లేకుండానే మాట్లాడారు. ప్రశ్నించిన ఎమ్మెల్యేలకు మంత్రులు సమాధానం ఇవ్వలేదు. సీఎం దృష్టికి తీసుకెళ్తామని, అధికారులు స్థానికంగా ఉండాలని చెప్పారు.
శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధ్యక్షతన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మూడు జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల, విద్యుత్, నీటిసరఫరా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా, పంటలు ఎండిపోకుండా, విద్యుత్ సరఫరా సక్రమంగా కొనసాగేలా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు తాగునీటి ఇబ్బంది రాకుండా ఈఎన్సీ స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు.
పంటలు ఎండిపోకుండా ఇంజినీరింగ్ అధికారులు కాల్వలపై పర్యటించాలని, విద్యుత్ అధికారులతో కలిసి నీటి పర్యవేక్షణ చేయాలని అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తక్షణ అవసరాల కోసం ప్రతి జిల్లాకు ఐదు కోట్లు, నల్లగొండ జిల్లాకు రూ.15కోట్లు నిధులు ఉంచాలన్నారు. తాగునీటి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. సాగునీటి నిర్వహణ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ అధికారులు పూర్తి స్థాయిలో సేవలు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్లు తాగునీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గుండాల మండలంలో 50శాతం పంటలకే నీరు వస్తుందని, మరో వారంపాటు 200 క్యూసెక్కుల నీటిని వదలాలని కోరారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ, బోరు నీళ్లు కలిసిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బస్వాపురం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ వశీకరణ చెల్లింపులు చేపట్టాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. మూసీలో గుర్రెపు డెక్క ఉండడంతోపాటు మోటార్లు వేయడంతో చివరి భూములకు నీరు వస్తలేదన్నారు. మూసీ పరిధిలో మోటార్లు బంద్ ఉండేందుకు రాత్రి పూట కరెంట్ కట్ చేయాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోతుందని, బిక్కేరు వాగు నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. ఎస్సారెస్సీ కింద బిక్కుమల్ల వరకు నీరు రావడం లేదని, కాల్వల్లో నిండిపోయిన చెత్తను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడుతూ తండాల్లో కొత్త బోర్లు వేసేందుకు అనుమతులు ఇవ్వాలని, హాలియా మున్సిపాలిటీకి నీటిని అందించే నిడుమనూరు చెరువును నింపాలని అన్నారు. నీటిసరఫరాలో భాగంగా క్రిటికల్ గ్యాస్‌ను పూర్తి చేసి పెండ్లిపాకల ప్రాజెక్టు కింద ఏజెన్సీ జీతాలు చెల్లించాలని, చిన్న పనులు కూడా చేయలేని దుస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ అవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ఎండాకాలంలో అద్దెకు తీసుకున్న ట్యాంకర్లకు, బోర్లకు అద్దెలు ఇవ్వలేదని, వారితో ఇప్పుడు మళ్లీ ఎలా పనులు చేయించాలని ప్రశ్నించారు.
రామన్నపేట, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆసిఫ్నెహర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విన్నవించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ చివరి భూముల వరకు సాగునీరు అందించాలని, ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నీటి విషయంలో స్పష్టత లేదని అన్నారు. అంతకుముందు ఉమ్మడి జిల్లాలో విద్యుత్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలపై కలెక్టర్లు చర్చించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిని మంత్రులు సన్మాంచారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇల్లు నమూనాను ప్రారంభించారు. సమావేశంలో కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నందలాల్ పవార్, నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ హరిలాల్, చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పాల్గొన్నారు.