చౌటుప్పల్: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మండలం చింతల గూడెం, దామెర గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని అన్నారు. రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, దళిత బంధు, కుల వృత్తులకు చేయూత ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల జేబులు నింపుతుంటే.. కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను గోస పెడుతున్నరని అన్నారు.
మోడీ వచ్చిన కొత్తలో గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉంటే ఇప్పుడు రూ.1200కు చేరిందని, అలాగే పెట్రోల్ లీటరు ధర రూ.60 ఉంటే నేడు రూ.110కు, డీజిల్ ధర లీటరు రూ.40 నుంచి రూ.100కు చేరిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయని అన్నారు. కేసీఆర్ వల్లనే ఇవన్నీ పెరిగాయని బీజేపీ నేతలు జూటా మాటలు ప్రచారం చేస్తున్నారన్న ఆయన ‘బొడ్రాయి సాక్షిగా చెప్తున్న ఇది ముమ్మాటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వమే పెంచింది. కేసీఆర్ ఏమో ప్రజల జేబులు నింపుతుంటే బీజేపీ మోడీ మాత్రం ప్రజల జేబులు దోచుకుంటున్నారు’ అని మండిపడ్డారు.
ప్రజల జేబు ఖాళీ చేసి.. దోచుకున్న డబ్బును రాజ గోపాల్ లాంటి అమ్ముడు పోయే దొంగలకు ఇస్తున్నారని ద్వజమెత్తారు. ప్రజల నుంచి దోచుకున్న రూ.18వేల కోట్లకు అమ్ముడుపోయిన దొంగ రాజ గోపాల్ రెడ్డి అని, అట్లాంటి దొంగ మునుగోడు ప్రజల ఓటు ఎలా అడుగుతాడని ప్రశ్నించారు. బీజేపీ వల్ల దేశానికి జరిగిన మంచి పని ఒక్కటి లేదన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ అన్ని వర్గాల ప్రజల పొట్ట కొడుతున్నారని అన్నారు. దళిత వ్యతిరేకి బీజేపీ అని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్, బీహార్లో బీజేపీ నాయకులు దళితులను కట్టేసి కొడుతూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని, దళితులు పెళ్ళిలో ఊరేగింపు చేసుకుంటే మీ కులం వాళ్ళు ఊరేగింపు చేసుకుంటారా? అని కొడుతూ అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులను అవమానించే బీజేపీకి దళిత యువకులు ఓటు రూపంలో బుద్ది చెప్పాలని కోరారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే అది మురిగిపోయినట్లే తప్ప ప్రయోజనం లేదని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ది జరుగుతుందని అన్నారు. తన దృష్టికి వచ్చిన బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు తదితర సమస్యలు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సొంత జాగ ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకునే పథకం త్వరలోనే కేసీఆర్ ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఈ ప్రచారం సీపీఐ రాష్ట్ర నాయకురాలు పద్మ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, స్థానిక టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.