హుజూర్నగర్, జూన్ 24 : సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, నేరేడుచర్ల, కోదాడ మున్సిపాలిటీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సోమవారం హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద చెరువు వద్ద మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధికి రూ.8కోట్లు, టౌన్ హాల్ నిర్మాణానికి రూ.6కోట్లు , ఖమ్మం ఎక్స్ రోడ్డు అభివృద్ధికి రూ.50 లక్షలు, మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ – విజయవాడ రోడ్డులో స్వాగత తోరణాలకు రూ.1.10 కోట్లు, చెరువు కట్ట బజార్ నుంచి అనంతగిరి రోడ్డు వరకు అవుట్ ఫాల్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.4.40 కోట్లు విడుదల చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
కోదాడ మున్సిపాలిటీలో అదనపు అవుట్ సోర్సింగ్ శానిటరీ సిబ్బంది ఏర్పాటుకు ఆమోదం, హుజూర్నగర్ మున్సిపాలిటీలో ఈద్గాహ్, శ్మశాన వాటికలు, సీసీ రోడ్ల అభివృద్ధికి రూ.3కోట్లు, గోవిందాపురంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్లు, దోబీఘాట్ నిర్మాణానికి రూ.2కోట్లు, మున్సిపాలిటీకి స్వీపింగ్ మిషన్, నేరేడుచర్ల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.15కోట్లు విడుదల చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంఏ అండ్ యుడీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.