కోదాడ, జూన్ 10 : సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను సామర్థ్యంతో పని చేయించడమే తన లక్ష్యమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనితీరుపై కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో కలిసి రైతుల సమక్షంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎత్తిపోతల పథకాల నిర్వహణలో రైతులపై భారం తగ్గించేందుకు లిఫ్ట్‌లపై సాంకేతిక సిబ్బంది ఎలక్ట్రీషియన్ ఆపరేటర్, వాచ్మెన్, పిట్టర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తామని తెలిపారు. జూలై ఒకటో తేదీ నాటికి లిఫ్ట్‌లన్నీ పూర్తిస్థాయిలో పనిచేయాలని సూచించారు. సాగర్ ఎడమ కాల్వపై హుజూర్నగర్ నియోజకవర్గంలో 19 లిఫ్ట్‌లు ఉన్నాయని, అవి ఎలా పనిచేస్తున్నాయో అధికారులు చెప్పాలన్నారు. అలాగే మూసీ, పాలేరు వాగులపై ఉన్న లిఫ్ట్, ఇరిగేషన్ల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కొత్త లిఫ్ట ఇరిగేషన్లకు నీటి వనరులను బట్టి రైతులు సహకరిస్తే తప్పకుండా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. చెరువులు ఆక్రమిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయని, ఎవరైనా చెరువులు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పద్మావతి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర్రావు, హుజూర్నగర్ ఎస్ఐ నర్సింహారావు, ఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్‌రావు, ఆర్డీఓలు, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.