హుజూర్నగర్, జూన్ 9 : హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హుజూర్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రెండు నియోజకవర్గాల్లో కొత్త, పాత పనులకు రూ.124.65 కోట్లు మంజూరయ్యాయన్నారు.
ఆర్అండ్బీ రోడ్లకు హుజూర్నగర్ నియోజకవర్గంలో 35 రహదారుల నిర్మాణానికి రూ.267 కోట్లు, కోదాడ నియోజకవర్గంలో 7 పనులకు రూ.156 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. విద్యుత్ శాఖకు రెండు నియోజకవర్గాల్లో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రూ. 15 కోట్లు, నూతన సబ్స్టేషన్ల ఏర్పాటుకు రూ.5 కోట్లు.. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో అర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. హుజూర్‌నగర్‌లో రింగ్ రోడ్డు పనులు, టౌన్‌హాల్ , మెయిన్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు.
హుజూర్నగర్ పట్టణ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. డిసెంబర్ వరకు 2,160 ఇండ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్‌రెడ్డి, ఈఈ భాస్కర్‌రావు, డీఈ రమేశ్, విద్యుత్ శాఖ ఎస్ఈ రామకృష్ణ, ఈఈ వెంకటయ్య, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : మండల కేంద్రంలో షాదీఖాన నిర్మాణానికి రూ.1.5 కోట్లు మంజూరైనట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. షాదీఖానా నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్‌ను హుజూర్నగర్ క్రాస్ రోడ్డు వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఎన్ఎస్పీ కాల్వల మీద ఉన్న శిథిల వంతెనల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. రామాపురంలో కూడా రూ. 1 కోటితో షాదీఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నాయకులు కొట్టె సైదేశ్వర్రావు, శాగంరెడ్డి గోవిందరెడ్డి, మునావర్, సైసా, మస్తాన్ పాల్గొన్నారు.