నేరేడుచర్ల/హుజూర్నగర్/హుజూర్నగర్ రూరల్/చింతలపాలెం/చిలుకూరు జూన్ 19 : రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద రూ.40 కోట్ల వ్యయంతో ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న ఐటీఐ కళాశాల పనులకు బుధవారం నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 65 ఐటీఐ కళాశాలల అప్‌గ్రేడ్‌కు ప్రభుత్వం రూ.2,324 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 76,900 మంది నిరుద్యోగులు ఉపాధి శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు.
పదో తరగతితోపాటు ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్‌లో 32 కోర్సుల్లో ప్రభుత్వం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి హుజూర్‌నగర్‌లో ఐటీఐ కళాశాల ఏర్పాటు ఎంతో ఉపయోగ పడనుందన్నారు. రానున్న అక్టోబర్, నవంబర్ నాటికి 2,160 సింగిల్ బెడ్రూం ఇండ్లను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. డిగ్రీ కళాశాల అప్‌గ్రేడ్, రింగ్ రోడ్డు, ప్రధాన రహదారి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో లిఫ్టులను ఆధునీకరించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం హుజూర్నగర్ మండలం లింగగిరి నుంచి యాతవాకిళ్ల వరకు రూ. 20కోట్లతో నిర్మించనున్న నూతన రోడ్డు, విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అలాగే చింతలపాలెం మండలం దొండపహాడ్లో రూ.20 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు, చిలుకూరులోని కోదాడ-జడ్చర్ల రహదారి నుంచి మండల పరిధిలోని బేతవోలు, జెర్రిపోతులగూడెం రోడ్డు విస్తరణ పనులకు, నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద రూ.20 కోట్లతో చేపట్టనున్న చిల్లేపల్లి-సోమారం రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ కలెక్టర్ ప్రియాంక, ఆర్డీఓ శ్రీనివాసులు, ఉపాధి శిక్షణ డిప్యూటీ డైరెక్టర్ రాజారావు, తాసీల్దార్ నాగార్జునరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ సంపత్‌రెడ్డి, ఎంపీపీలు గూడెపు శ్రీనివాస్, కొట్టె పద్మాసైదేశ్వర్‌రావు,బండ్ల ప్రశాంతి, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీష, కాంగ్రెస్ చింతలపాలెం మండలాధ్యక్షుడు నరాల కొండారెడ్డి పాల్గొన్నారు.