సుంకిశాలలో పంపింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన
బుద్ధవనం ప్రాజెక్టు సందర్శన
హాలియాలో రూ.56కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
బహిరంగ సభలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు తరలిరానున్న పలువురు మంత్రులు
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే భగత్
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి హెలికాప్టర్లో బయల్దేరనున్న మంత్రి కేటీఆర్ ముందుగా పెద్దవూర మండలం సుంకిశాల పరిధిలో హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాల సరఫరా కోసం ఇంటెక్ వెల్ వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అనంతరం హాలియాకు చేరుకుని హాలియా, నందికొండకు సంబంధించి రూ.56కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి.. బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం మరోసారి ఏర్పాట్లపై సమీక్షించారు.
నల్లగొండ ప్రతినిధి, మే13(నమస్తే తెలంంగాణ)/హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో అభివృద్ధి ప్రణాళిక చకచకా ముందుకు సాగుతున్నది. ఉప ఎన్నికల సమయంలో సాగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కీలకమైన నెల్లికల్లు లిఫ్టుతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల అభివృద్ధి, డిగ్రీ కళాశాల ఏర్పాటు, కాల్వల వెంట బ్రిడ్జిల నిర్మాణం, అన్ని గ్రామాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు ఇలా అనేక కార్యక్రమాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో అంశాల వారీగా పరిపాలన అనుమతులు ఇస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే నెల్లికల్లు లిఫ్ట్ పనులు శరవేగంగా జరుగుతుండగా మున్సిపల్ కేంద్రాల్లో పలు పనులకు శనివారం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పునాదిరాయి వేయనున్నారు. జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి సుమారు రూ.56కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు శంకస్థాపన చేయనున్నారు. ఉప ఎన్నికల తర్వాత కేటీఆర్ తొలిసారి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం కోసం జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం హాలియా పట్టణంలోని పోలీస్‌స్టేషన్ వెనక, సాగర్ ఎడమ కాల్వ వెంట ఉన్న ఖాళీస్థలంలో బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభలో మంత్రి కేటీఆర్ నియోజకవర్గ ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పలువురు మంత్రులు కూడా..
స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగే సభలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఇతర మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పి. సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌తో పాటు ఇతర ముఖ్యలంతా పాల్గొనున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు బహిరంగసభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జునసాగర్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే హాలియాలో వివిధ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్ శనివారం హాలియాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు. సభావేదికను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. అనంతరం బుద్ధవనంలో ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, తాసీల్దార్ లావూరి మంగ, సీఐ సురేశ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
రూ.56 కోట్ల అభివృద్ధి పనులివే..
హాలియాలో రూ.2 కోట్లతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణం, రూ. కోటితో వైకుంఠధామం, రూ. 4.5 కోట్లతో హాలియాలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, రూ.5 కోట్లతో ఆడిటోరియం నిర్మాణం, రూ.కోటితో డిజిటల్ లైబ్రరీ, రూ.4.5 కోట్లతో సీసీ రోడ్డు, ఎస్డబ్ల్యూ డ్రెయిన్, రూ.75 లక్షలతో మినీ స్టేడియంలో గ్రౌడ్ లెవలింగ్ పనులు, రూ. 75 లక్షలతో ప్రధాన రహదారి నుంచి వైకుంఠధామం వరకు సీసీ రోడ్డు, రూ.8.5 కోట్లతో నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్ట సుందరీకరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
నాగార్జునసాగర్‌లో..
నందికొండ మున్సిపాలిటీలో రూ. కోటితో వైకుంఠధామం నిర్మాణం, రూ.2 కోట్లతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణం, రూ.1.5 కోట్లతో సాగర్ హిల్‌కాలనీలో బస్టాండ్ కాంప్లెక్ నిర్మాణం, రూ. రూ. 4.5 కోట్లతో ఆడిటోరియం నిర్మాణం, రూ. 9 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణం, రూ. కోటితో పైలాన్ కాలనీలో ఆర్టీసీ బస్టాండ్ రీమోడలింగ్, రూ. కోటితో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం, రూ.8 కోట్లతో జెన్కో నుంచి పైలాన్‌కాలనీ వరకు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్