ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలతోపాటు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష కోసం గురువారం జిల్లాకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో పలువురు మంత్రుల బృందం రానుంది. నేడు మునుగోడులో జరుగనున్న సమీక్షా సమావేశం కోసం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి అంశాల ఎజెండాను రూపొందించారు. ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పథకాలను సమీక్షిస్తూనే ఇంకా చేపట్టాల్సిన పనులపై శాఖల వారీగా రివ్యూ చేయనున్నారు. దాంతోపాటు ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపైనా ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా ప్రజాప్రతినిధులతోపాటు వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్30(నమస్తే తెలంగాణ) : మునుగోడుకు నేడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రానున్నారు. మంత్రుల బృందం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి 11 గంటల వరకు మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్లో నిర్వహించే సమీక్షా సమావేశంలో వీరంతా పాల్గొననున్నారు.
సమీక్ష అనంతరం మధ్యాహ్నా భోజనం పూర్తి చేసుకుని రెండు గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. సమీక్షా సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు వివిధ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు, మూడు జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, శాఖల అధికారులందరూ పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే అమలువుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రివ్యూ చేయనున్నారు. స్థానిక సంస్థల్లో పాలన, ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్ సమస్యలు, గిరిజన తండాల అభివృద్ధి తదితర అంశాలు ప్రధాన ఏజెండాగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా మున్సిపాలిటీల్లో రోడ్లు, సమీకృత మార్కెట్లు, జంక్షన్లు, పార్కులు, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి అంశాలతో పాటు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైనా ప్రణాళికలు సిద్ధం చేసేలా సమీక్ష చేపట్టనున్నారు.
వివిధ విభాగాల వారీగా మంత్రులు, అధికారులంతా హాజరుకానుండడంతో చేపట్టాల్సిన పనులపైనా రోడ్‌మ్యాప్ సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. నిర్ధేశిత గడువు లోగా ప్రణాళికబద్దంగా అభివృద్ది పనులను పూర్తి చేసేలా సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని అభివృద్ధితో పాటు ఇటీవల ఉప ఎన్నికల సమయంలో మునుగోడులో ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి అంశాలపైనా ఈ సమీక్షలో ప్రత్యేకంగా రివ్యూ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సమీక్ష సమావేశం కోసం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో శాఖల వారీగా పూర్తి వివరాలతో నివేధికలను సిద్ధం చేశారు. సమీక్షా సమావేశంపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. స్వరాష్ట్రంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని చెప్పారు.
సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు విద్య, వైద్య రంగాల్లోనూ ఘననీయమైన ప్రగతిని సాధించామన్నారు. ఇప్పటికే జిల్లాలో మౌలిక వసతుల కల్పన కోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు మిగిలి ఉన్న అంశాలపైనా చర్చించేందుకు నేటి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ సమక్షంలో అంశాల వారీగా చర్చించి నిర్ధిష్టమైన లక్ష్యాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. మునుగోడు అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
మంత్రుల సమీక్ష సమావేశానికి సర్వం సిద్ధం
మునుగోడు : మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై గురువారం మునుగోడులో నిర్వహించనున్న రాష్ట్ర మంత్రుల సమీక్ష సమావేశానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డితో ఇతర శాఖల అధికారులు మునుగోడులోని చండూరు రోడ్డులో గల ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అక్కడే ఉన్న కలెక్టర్‌కు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన సౌకర్యాలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో సూర్యాపేట ఎస్పీ రాజేందర్ ప్రసాద్, జేసీలు భాస్కర్‌రావు, కుష్బూగుప్తా, డీఈఓ భిక్షపతి, నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, ఎంపీటీసీ ఈద నిర్మలాశరత్బాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఉన్నారు.