నీలగిరి, జూన్ 26: భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన గురువారం జెండాఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని, స్టూడెంట్స్ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం నల్లగొండలో 34 కోట్లతో సిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామని త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. డ్రగ్స్ వాడే వారిని తరిమికొట్టాలని, విద్యార్థులు 20 ఏండ్ల వరకు చదు వు, స్పోర్ట్స్, యోగాపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రకాశం బజార్లో ప్రతీక్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మిస్తున్నామని, డిజిటల్ తరగతులతో పా టు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ అమిత్, ఆదనపు ఎస్పీ రమేశ్, డీడబ్ల్యూవో కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీఈవో భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
భవిత కేంద్రం ప్రారంభం
ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆధునీకరించిన భవిత కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులతో మాట్లాడుతూ ఏవైనా సౌకర్యాలు అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్పీచ్ థెరపీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరడంతో మంత్రి అంగీకరించారు.