– యాదగిరి యాదవ్‌పై దాడి చేసి, మూత్రం తాగించిన ఘటనపై బీసీ సంఘాల ఆగ్రహం
– దాడికి పాల్పడిన సందీప్ రెడ్డి, సహకరించిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
– బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి
– బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్, బీసీ సంఘాల డిమాండ్
నల్లగొండ, డిసెంబర్ 05 : నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరి యాదవ్‌కి తక్షణమే రక్షణ కల్పించి, దాడులు, బెదిరింపులకు దిగిన ప్రత్యర్థి అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి.రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం చలో ఎల్లమ్మగూడెం కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీలు, బీసీ సంఘాలు, యాదవ సంఘాలను కలుపుకుని బాధితుడు యాదగిరి, అతని భార్య, సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మిని పరామర్శించారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ ఘటనకు కారకులైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విసునూరి రామచంద్రారెడ్డి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు.
దాడికి పాల్పడిన వారిపై వెంటనే హత్యాయత్నం కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి బీసీలకు కనీసం పోటీ చేసే స్వేచ్ఛ కూడా లేదా, ప్రజా పాలన అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీతో పాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 10న అసెంబ్లీ గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పార్టీలు, సంఘాలకు అతీతంగా పాల్గొని దిగ్విజయం చేయాలని రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, గొర్ల కాపరుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సోమనబోయిన సుధాకర్ యాదవ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుకే యాదవ్, నల్లగొండ జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మామిడి నాగలక్ష్మి యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్, చాకలి ఐలమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు నాగిళ్ల శంకర్, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు యాదగిరి, భువనగిరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు పుట్ట విరేశ్ యాదవ్, భువనగిరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు పుట్ట వీరేష్ యాదవ్, యాదవ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్, మల్లేశ్ యాదవ్, ఎల్వీ యాదవ్, పంకజ్ యాదవ్, బెల్లి నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.

Nalgonda : ‘మంత్రి కోమటిరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి’