తిప్పర్తి, డిసెంబర్ 5: ‘తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరి యాదవ్‌కు తక్షణమే రక్షణ కల్పించాలి. దాడులతో పాటు బెదిరిస్తున్న ప్రత్యర్థి అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలి. ఘటనకు కారకులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి’ అని మాజీ ఎంపీ బుడుగుల లింగయ్య యాదవ్, షీప్ అండ్ గో డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. చలో ఎల్లమ్మగూడెం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ బుడుగుల లింగయ్య యాదవ్ నేతృత్వంలో వివిధ పార్టీలు, బీసీ, యాదవ సంఘాల నేతలు శుక్రవారం బాధితుడు యాదగిరి, అతని భార్య.. సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మిని పరామర్శించారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ ఘటనకు కారకులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విసునూరి రామచంద్రారెడ్డి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే హత్యాయత్నం కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై డీజీపీతో పాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చే స్తామన్నారు. ఈ నెల 10న అసెంబ్లీ గన్ పార్ అమరవీరుల స్థూపం దగ్గర తలపెట్టిన ధర్నాలో పార్టీలు, సంఘాలకతీతంగా పాల్గొని దిగ్విజయం చేయాలని రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. గొర్ల కాపరుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు సోమనబోయిన సుధాకర్ యాద వ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుకే యాదవ్, నల్గొండ జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మామిడి నాగలక్ష్మి యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు కొకు దేవేందర్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్, చాకలి ఐలమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు నాగిళ్ల శంకర్, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు యాదగిరి, భువనగిరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు పుట్ట వీరేశ్ యాదవ్, యాదవ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్, మల్లేశ్ యాదవ్, ఎల్వి యాదవ్, చీర పంకజ్ యాదవ్, బెల్లి నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.